టిఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, ఆగస్టు 6: వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మాజీ నాయకులు, పేద ప్రజల పక్షపాతి, టిఆర్ఎస్ దుబ్బాక శాసన సభ్యులు సోలిపేట రామ లింగారెడ్డి బుధవారం అర్ధరాత్రి తరువాత మృతి చెందారు. తన కాలుకు రక్త ప్రసరణలో చిన్న ఇబ్బంది ఏర్పడడంతో దాదాపు 20 రోజుల క్రితం కొంపల్లి లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి ఆయన శస్త్ర చికిత్స చేయించుకోగా, అది వికటించి తీవ్ర అస్వస్థతకు గురై పోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను వారం రోజుల క్రితం గచ్చిబోలిలోని ఏ.ఐ.జీ ఆసుపత్రికి తరలించారు. వెంకిలేటర్ పై మృత్యువుతో పోరాడుతున్న అయన రాత్రి 2.30గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. ప్రాణాలను ఫణంగా పెట్టి మెతుకుసీమ ప్రజా ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన గొప్ప చరిత్ర లింగారెడ్డిది. ఓ పాత్రికేయుడిగా వర్కింగ్ జర్నలిస్టుల హక్కుల సాధనకై నాటి ఏపీయూడబ్ల్యుజెలో మెదక్ జిల్లా అధ్యక్షుడిగా అవిశ్రాంతంగా పోరాడారు. భారత దేశంలోనే ప్రప్రథమంగా ఓ పాత్రికేయుడిపై టాడా కేసు నమోదవ్వడం..అది లింగారెడ్డిపైనే కావడం ఆ రోజుల్లో చర్చనీయాంశమైన అంశం. పోలీసుల నుండి తన ప్రాణానికి ముప్పు పొంచి వుంటుందని తెలిసినా ఏనాడు ఉద్యమాల నుండి వెనకంజ వేయని సాహస వీరుడు ఆయన. చావుకు తాను భయపడనని, దానికి ఎప్పుడైనా సిద్ధమేనంటూ ఆ రోజుల్లో పలు సందర్భాల్లో సవాల్ విసిరిన ప్రజా ఉద్యమకారులు అయన. ఒక్కమాటలో చెప్పాలంటే ముక్కు సూటితనం ఆయన నైజం. ప్రజల్లో ఆయనకున్న పేరు ప్రతిష్టలు, ధైర్య సాహసాల నేపథ్యంలో కేసిఆర్ ఆయనను తెలంగాణ ఉద్యమంలోకి లాగి శాసనసభ ఎన్నికల్లో అప్పటి దొమ్మట(ప్రస్తుత దుబ్బాక) నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ నుండి బరిలో దింపారు. ఎమ్మెల్యే గా పేద ప్రజల కోసమే నిరంతరం కృషి చేస్తున్న లింగారెడ్డి ఆకస్మిక మృతి పట్ల ఆ నియోజకవర్గంలో, టీఆర్ఎస్ లో విషాదచాయలు అలుముకున్నాయి. లింగారెడ్డి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యుజె) పక్షాన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపింది.