JMS News Today

For Complete News

ఆ మంత్రికి ఎన్నికలపైనే శ్రద్ద…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, డిసెంబర్ 1: జిల్లా మంత్రి గంగుల కమలాకర్ కు ఎమ్మెల్సీ ఎన్నికపై ఉన్న శ్రద్ధ ధాన్యం, రైతుల ఇబ్బందులపై లేదని, టిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలు తోడు దొంగల్లా మారి రైతులను నిలువునా ముంచుతున్నారని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి..అప్పు..సప్పు చేసి..పెట్టుబడి పెట్టి పండించిన వడ్లు ఐకెపి కేంద్రానికి తెచ్చి 20 రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదని విమర్శించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి సొంత జిల్లాలో రైతులు ధాన్యాన్ని అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం సిగ్గుచేటన్నారు. ధాన్యం ఐకెపి సెంటర్ కు తెచ్చి 20 రోజులు గడుస్తున్నా అకాల వర్షాలు పడ్డ కనీసం టార్పాలిన్ కవర్లు అందించలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వ యంత్రాంగం కొట్టుమిట్టాడుతుందని విమర్శించారు. ధాన్యం రోజు ఆరబోస్తూ కుప్పల వద్ద రాత్రి.. పొద్దు తేడా లేకుండా కాపల ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. మేచర్, తాలు పేరుతో దోపిడీ చేస్తున్నారని, ఒక్కో లోడ్ కు 2 క్వింటాళ్ల వడ్లను వివిధ సాకులతో ఎక్కువ జోకి రైతులను నిలువుదోపిడి చేస్తున్నారని మండిపడ్డారు. మిల్లర్లు, ప్రభుత్వ పెద్దలు, అధికారులు కుమ్మక్కై రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు. 24 గంటల విద్యుత్ అవసరం లేదని, రైతాంగానికి 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ను అందించాలన్నారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని, ఎలక్ట్రానిక్ కాంఠలతో తూకం సక్రమంగా వేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాల రద్దు కంటి తుడుపు మాత్రమేనని, ప్రధాని మోడీ ఆలోచన విధానాలకు కేసీఆర్ వంతపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ రైతు పక్షపాతిగా ఉంటే పంటలకు తెలంగాణలో మద్దతు ధర ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం వచ్చాక రైతుల ప్రయోజనం కోసం మొదటి ప్రధాని దివంగత నెహ్రూ ఎఫ్సీఐ ఏర్పాటు చేశారన్నారు. ధాన్యం కుప్పల మీద రైతులు చనిపోతుంటే కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్సీ క్యాంపు రాజకీయాల్లో బిజీ గా ఉన్నారని అన్నారు. డిసెంబర్ 15లోపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ సమస్యలను తేల్చకుంటే కరీంనగర్ వేదికగా వరి దీక్ష చేస్తామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ బాధ్యతల నుండి తప్పించుకకుంటున్నారని ఆరోపించారు. బండి సంజయ్ ఏనాడైనా వ్యవసాయ రంగాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, చొప్పదండి కాంగ్రెస్ ఇంఛార్జి మేడిపల్లి సత్యం, నాయకులు సమద్ నవాబ్, ఎండి తాజ్, ఉప్పరి రవి, శ్రవణ్ నాయక్, అబ్దుల్ రహమాన్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, ఏజ్రా, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.