సెంచరీ తప్పదు….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, డిసెంబర్ 2: హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ వంద స్థానాల్లో గెలుస్తుందని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆమె కరీంనగర్ నగరంలో పర్యటించారు. నగరంలోని పురాతన శివాలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని విమర్శించారు. కానీ ఎన్నికల్లో మాత్రం తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్దిని ప్రశ్నించడం మాని కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సంజయ్ కి హితవు పలికారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ వెయ్యి కోట్లకు పైగా నిధులు తీసుకువచ్చి నగరంలో అభివృద్ధి పనులు చేపడుతున్నారని పేర్కొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు తీసుకురాని ఎంపీ సంజయ్ ని ప్రజలు నిలదీయాలని కవిత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ సునీల్ రావు, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ లతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.