అందుబాటులోకి మరో సాంకేతిక అస్త్రం
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, మార్చి 29: టెక్నాలజీ వినియోగంతో ముందుకుసాగుతున్న కరీంనగర్ కమీషనరేట్ పోలీసులకు మరో సాంకేతిక ఆస్త్రం అందుబాటులోకి వచ్చింది. శాంతిభద్రతల భంగం కలిగే చర్యలు జరిగిన సందర్భాలలో పరిస్థితులను ఎప్పటికప్పుడూ తెలుసుకుంటూ ముందుకు సాగేందుకు వీలుగా కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కు నూతనంగా మోబైల్ కమాండ్ కంట్రోల్ వాహనం అందుబాటులోకి వచ్చింది. శనివారం ఈ వాహనంతో జిల్లా కలెక్టర్ కె శశాంక , పోలీస్ కమీషనర్ వి.బి. కమలాసన్‌రెడ్డి , మున్సిపల్ కమీషనర్ వల్లూరి క్రాంతిలతో ఫ్లాగా మార్చ్ నిర్వహించిన విషయం విదితమే. ఈ మోబైల్ కమాండ్ కంట్రోల్ వాహనానికి ఉన్న సదుపాయాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ వాహనంలో మూడు కెమెరాలు అమర్చబడి ఉంటాయి. ఇందులో ఒకటి పిటిజడ్ 360 డిగ్రీలలో తిరుగుతూ ఉంటుంది. మరో రెండు కెమెరాలు చుట్టుపక్కల జరిగే వివిధ రకాల చర్యలను రికార్డు చేస్తుంది. పైన పేర్కొన్న మూడు కెమెరాల్లో ప్రతిదృశ్యం నిక్షిప్తం కాబడి ఉంటుంది. శాంతి భద్రతలకు సంబంధించి అత్యంత అవసరం ఏర్పడిన సందర్భంలో ఈ వాహనాన్ని వినియోగిస్తారు. ఇందులో ప్రజలకు తగు జాగ్రత్తలు, సూచనలు, హెచ్చరికలు చేసేందుకు ఆప్లి ఫైర్ సిస్టమ్ కూడా ఉంటుంది. దీని ద్వారా ప్రజలకు ఈ వాహనంలోని మైకుల ద్వారా తెలియపర్చడం జరుగుతుంది. ప్రస్తుతం కోవిడ్ -19 నేపథ్యంలో లాక్ డౌన్ దరిమిలా సాయంత్రం 7గంటల నుండి ఉదయం 6గంటల వరకు కర్ప్యూ నిర్వహిస్తుడటంలో ఈ వాహనాన్ని వినియోగిస్తున్నారు. లాక్ డౌన్, కర్ప్యూ ఆదేశాలను ధిక్కరించే వారి కదలికలను గుర్తించేందుకు పిటిజడ్ కెమెరా, చుట్టుపక్కల ప్రాంతాలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడిన వారి దృశ్యాలు నిక్షిప్తం చేయబడుతాయి. ఆదేశాలను ఉల్లఘించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ఈ నిక్షిప్తం కాబడిన దృశ్యాలు సాక్ష్యంగా స్వీకరిస్తారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో రేయింబవళ్ళు అత్యంత ఆధునిక సాంకేతికతో కూడిన ఈ వాహనం సేవలను వినియోగిస్తున్నారు. రేయింబవళ్ళు అందుబాటులో కమాండ్ కంట్రోల్ వాహనం కమీషనరేట్ వ్యాప్తంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలు జరిగిన సందర్భంలో సత్వరం ఈ వాహనంతోపాటు వేగవంతంగా సేవలందించే వివిధ విభాగాలకు చెందిన సాంకేతిక నిపుణులు , సంబంధిత అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఇందులో విహెచ్ఎఫ్ సెట్ కూడా అమర్చబడి ఉంది. ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకోవడంతోపాటు, సదరు ప్రాంతాల నుండి వచ్చే సమాచారానికి సత్వరం స్పందించి సేవలందిస్తారు. కమ్యూనికేషన్ విభాగానికి చెందిన ఇన్స్ పెక్టర్ సుధాకర్ ప్రత్యేక శిక్షణ పొంది ఈ వాహనానికి ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం నెలకొని ఉన్న కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలతో పాటు, శాంతి భద్రతలకు సంబంధించి తలెత్తే సమస్యలపై సత్వరం స్పందించి సేవలందిచడంతోపాటు ప్రజల భద్రత, రక్షణ కోసం ప్రభుత్వం కరీంనగర్ కమీషనరేట్ కు ఈ వాహనాన్ని మంజూరు చేసిందని కరీంనగర్ పోలీస్ కమీషనర్ విబి కమలాసన్ రెడ్డి తెలిపారు. శాంతిభద్రతలు ఉల్లఘించే చర్యలకు పాల్పడిన వారు ఈ వాహనంలోని వివిధ కెమెరాల ద్వారా నిక్షిప్తం కాబడిన దృశ్యాలను సాక్ష్యంగా స్వీకరించడం, సదరు వ్యక్తులకు శిక్షలు విధించబడేలా దోహదపడుతుందని చెప్పారు. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు , పాటించాల్సిన ఆదేశాలను తెలియజేయడం జరుగుతుందని సీపీ చెప్పారు.