JMS News Today

For Complete News

కేసీఆర్ కు పోలీసులు గులాంగిరీలా…?

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, నవంబర్ 2: ఎంపీ అని చూడకుండా తనపై పోలీసులు దాడి చేస్తే రాష్ట్ర హోంమంత్రి, డీజీపీ ఎక్కడున్నారని, ఏమి చేస్తున్నారని, ముఖ్యమంత్రికి గులాంగిరీ చేస్తున్నారా? అంటూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని, మఫ్టీ పోలీసులే శవాన్ని ఎత్తుకెళ్లారని, ఇది సిగ్గుచేటన్నారు. శనివారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మఫ్టీలో ఉండి కార్యకర్తలపై పిడిగుద్దులు గుద్దారని,
విచక్షణా రహితంగా కొట్టారని, బూట్లతో ఏబీవీపీ కిరణ్ ను కాళ్ళపై తొక్కారని, ఆ దెబ్బలకు విలవిల కొట్టుకుంటున్నా, పోలీసులు కనికరం లేకుండా వ్యవహరించారని ఆరోపించారు. నిన్న కరీంనగర్ లో జరిగిన ఘటనలు అందరూ చూశారని, డ్రైవర్ బాబు గుండెపోటుతో మరణించిన తర్వాత నుంచి నిన్నటి అంత్యక్రియల వరకు పోలీసులు ఎంతో ఇబ్బందిపెట్టారని తెలిపారు. ఆస్పత్రి నుంచి వచ్చిన అంబులెన్స్ డ్రైవర్ ను కొట్టి పోలీసులే మృతదేహన్ని ఇంటివద్ద పడేసి వెళ్ళారని ఆరోపించారు. ఆ కుటుంబానికి, కార్మికులకు న్యాయం జరగాలన్న ఆర్టీసీ జేఏసీ నిర్ణయం మేరకు అంత్యక్రియల ఆపినట్లు, సీఎం చర్చలు జరపేంతవరకు అంతిమయాత్ర చేయకూడదని జేఏసీ నిర్ణయించిందని చెప్పారు. అయితే, చివరి చూపుగా డిపోకు తమ నాన్న మృతదేహాన్ని తీసుకెళ్ళాలని కుటుంబ సభ్యులు కోరడంతో యాత్ర శాంతియుతంగా చేయాలని నిర్ణయించి, ప్రారంభిస్తే పోలీసులు వ్యవహారించిన తీరు బాధాకరమని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి పోలీసులను రప్పించారని, వాళ్ల పేర్లు కూడా వారికి తెలియదని చెప్పడం, నాపై వెనక నుంచి ఒకరు, ముందు నుంచి ఒకరు పథకం ప్రకారం దాడి చేసినట్లుగా ఉందని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని, గవర్నర్ నివేదిక కూడా కేంద్రానికి వెళ్లిందని, సరైన సమయంలో తప్పక స్పందిస్తుందని చెప్పారు. నక్సలైట్ల చేతిలో అమరులైన పోలీసుల ఆత్మలు నిన్నటి మీ తీరు  చూసి ఘోషిస్తున్నాయని, ప్రమోషన్ల కోసం ప్రభుత్వానికి గులాం గిరి చేస్తారా? అంటూ మండిపడ్డారు. సర్కార్ తీరు నచ్చక నిజమైన, నిజాయితీ గల పోలీసు అధికారులు లూప్ లైన్ లో ఉన్నారని పేర్కొన్నారు. మాస్క్ లు వేసుకుని లాఠీలు లేకుండా ఎలా కొట్టొచ్చో చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. 21 మంది చనిపోతే నిజాం తరహాలో రాజభోగాలు అనుభవిస్తున్న సీఎం కేసీఆర్ కు రజకార్లలాగా ఉంటామంటే తిరుగుబాటు ఎలా ఉంటుందో చూపిస్తామని హెచ్చరించారు. లక్షల మందికి ఎంపీనైన నాపై దాడి ప్రజలపై దాడి జరిగినట్లే. నా గళ్లా పడితే వాళ్ల గళ్లా పట్టినట్లే, ఆ ఇద్దరు పోలీసులపై పార్లమెంట్ లో ప్రివిలేజ్ మోషన్ పెడ్తానంటూ హెచ్చరించారు. సీఎం పతనం కరీంనగర్ నుంచే ప్రారంభమైందని సంజయ్ అన్నారు. చర్చలు జరపమంటే జరపకపోగా, కోర్టునే తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. సెల్ఫ్ డిస్మిస్ అనే పదం వెనక్కి తీసుకుని కార్మికులను చర్చకు పిలవాలన్న మానవత్వం కూడా కేసీఆర్ కు లేదని దుయ్యబట్టారు. కోర్టును ఎలా తప్పుదోవ పట్టించవచ్చో చర్చించడానికే సీఎం సమీక్షలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. సీఎం దగాకోరు, అబద్ధాల కోరు అనేది కోర్టు వ్యాఖ్యలతోనే తేలిపోయిందని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు బయపడొద్దు. ధైర్యంగా ఉండండి అంటూ భరోసా ఇచ్చారు. నిన్నటి పోరాటంలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులకు, జేఏసీ నేతలకు హ్యాట్సాఫ్ చెప్పారు. ఆర్టీసీ కార్మికుల పిల్లల ఫీజుల కోసం ప్రయివేటు విద్యా సంస్థలు ఒత్తిడి తేవద్దని, వీలైతే మాఫీ చేయాలని, లేకపోతే వాయిదాకు అవకాశం ఇవ్వాలని ఎంపీ సంజయ్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు, నగర అధ్యక్షుడు బేతి మహేందర్ రెడ్డి, మాజీ మేయర్ డి.శంకర్, నాయకులు కొట్టే మురళీ, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *