ముఖేష్ మృతి పట్ల సీఎం సంతాపం…
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూలై 29: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. ముఖేశ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ముఖేశ్‌గౌడ్ మృతి విచారకరమని చంద్రబాబు అన్నారు. మూడు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న ముఖేశ్.. బీసీల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే కాంగ్రెస్ నాయకులు సంతాపం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య తదితరులు ముఖేశ్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిని ఓదార్చారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. కాగా, రెండు రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ ఇద్దరు సీనియర్ నేతలను కోల్పోవడం ఆ పార్టీకి తీరనిలోటుగా మారగా, ఆ పార్టీ నేతలు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు.