ఎమైతదో…ఏమో…!?
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జనవరి 4: పుర పైట్ వడివడిగా చివరి దశకు చేరుకుంటున్న దరిమిలా..ఈ ఎన్నికలు సల్లగుండా ఎమైతదో..ఏమో… అంటూ ఆశావహులు నరాలు తెగే ఉత్కంఠకు గురవుతున్నారు. ఆరునూరైన ప్రజాప్రతినిధి కావాలన్న ఆశతో ఇప్పటికే విందు, వినోదాలతో లక్షలు ఖర్చు చేస్తున్న నేతలకు (ఆశావహులు) రిజర్వేషన్ల గుబులు పట్టుకుంది. శనివారం తుది ఓటర్ల జాబితాను విడుదల చేయగా, ఆదివారం వార్డుల వారీగా రిజర్వేషన్లు ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు ఏలా ఉంటాయోనన్న ఆందోళన వారిని వెంటాడుతుంది. కరీంనగర్ జిల్లాలో ఒక కార్పోరేషన్, నాలుగు మున్సిపాలిటీలలో ఎన్నికలు జరుగుతుండగా, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం చేపట్టిన కసరత్తు చివరి దశకు చేరుకుంటోంది. ఇందులో అత్యంత ప్రధానమైన తుది ఓటర్ల జాబితాను శనివారం విడుదల చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం కులాల వారీగా స్థానాల కేటాయింపు కూడా పూర్తి చేశారు. కరీంనగర్ కార్పోరేషన్ లో మొత్తం 60 స్థానాలు ఉండగా, ఎస్టీ-1, ఎస్టీ మహిళ – 0, ఎస్సీ -3, ఎస్సీ మహిళ -3, బీసీ -12, బీసీ మహిళ- 11, జనరల్ మహిళ -16, జనరల్ – 14 చొప్పున కేటాయించారు. ఆలాగే జమ్మికుంట మున్సిపాలిటీలో మొత్తం 30 స్థానాల్లో ఎస్టీ జనరల్-1, ఎస్టీ మహిళా -0, ఎస్సీ జనరల్ -3, ఎస్సీ మహిళా -3 , బీసీ జనరల్ 4, బీసీ మహిళా -4, జనరల్ మహిళా-8, జనరల్-7, హుజూరాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 30 స్థానాల్లో ఎస్టీ జనరల్-1, ఎస్టీ మహిళా -0, ఎస్సీ జనరల్ -3, ఎస్సీ మహిళా -3, బీసీ జనరల్ -4, బీసీ మహిళా -4, జనరల్ మహిళా -8, జనరల్ -7, చొప్పదండి మున్సిపాలిటీలో మొత్తం 14 స్థానాల్లో ఎస్టీ జనరల్ -1, ఎస్టీ మహిళా -0, ఎస్సీ జనరల్ -2, ఎస్సీ మహిళా -1, బీసీ జనరల్ -2, బిసి మహిళా -1, జనరల్ మహిళా-5, జనరల్-2, కొత్తపల్లి మున్సిపాలిటీలో మొత్తం 12 స్థానాల్లో ఎస్టీ జనరల్-1, ఎస్టీ మహిళా -0, ఎస్సీ మహిళా -1, ఎస్సీ జనరల్ -1, బీసీ జనరల్ -2, బీసీ మహిళా -1, జనరల్ మహిళా-4, జనరల్-2 చొప్పున కేటాయించారు. వీటికి సంబంధించి ఆదివారం జిల్లా కలెక్టర్ కె.శశాంక అధికారికంగా రిజర్వేషన్లను ప్రకటించనున్నారు. అయితే, అధికార పార్టీ నేతలు ముందస్తుగానే మేల్కోని రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వచ్చేలా ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం మాత్రం జరుగుతోంది. రిజర్వేషన్ల పై ప్రస్తుతం ఆశావహుల్లో ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కార్పొరేటర్, కౌన్సిలర్ గా పోటీ చేయాలనుకున్న ఆశావహులు ఆయా స్థానాల్లో విజయం సాధించడానికి అవసరమైన సానుకూల పరిస్థితులను ఏర్పాటు చేసుకునేందుకు విందులు, వినోదాలతో లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఏదిఏమైనా మున్సిపల్ సమరానికి అధికారులు చేస్తున్న కసరత్తు చివరి దశకు చేరుకుంటున్న దరిమిలా ఇటు ఆశావహుల్లో..అటు అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది.