సమయం లేకపోయినా సరే…మేము రెడీ
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జులై 14: ప్రతిపక్షాలకు సమయం ఇవ్వకుండా ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని చూస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ఆరోపించారు. అయినా సరే బీజేపీ సర్వసన్నద్ధంగా ఉందని అన్నారు. మొదటిసారి రాష్ట్రంలోని అన్ని వార్డుల్లో పోటీ చేస్తున్నామని, మున్సిపాలిటీలను క్లస్టర్లుగా విభజించి పని విభజన చేస్తున్నామని తెలిపారు. వచ్చే నెల నుంచి ఇద్దరు చొప్పున కేంద్రమంత్రులు తెలంగాణలో పర్యటించనున్నారని తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల్లో ఆదరణ చాలా బాగుందని, అన్ని వర్గాల ప్రజలు సభ్యత్వాన్ని చేసుకుంటున్నారని, మహిళలు, మైనారిటీలు భారీగా బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న సభ్యత్వ నమోదుపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, సభ్యత్వ నమోదు బాధ్యులు శివరాజ్‌సింగ్ చౌహాన్ సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన వెల్లడించారు. గతేడాది చివర్లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క ఎమ్మెల్యే స్థానానికే పరిమితమైన భాజపా.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలతో 20 శాతం ఓట్లు సాధించిందని అన్నారు. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసి 4 ఎంపీ సీట్లను గెలవడమనేది గతంలో ఉమ్మడి ఏపీలో సైతం సాధ్యం కాలేదన్నారు. మోదీ పాలనకు ఇది రెఫరెండమని చెప్పారు. ఈ ఐదేళ్లలో అవినీతిలేని పాలన అందించారని, చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ఓ సామాన్య వ్యక్తి ప్రధానిగా ఎన్నికై పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు తీసుకుని దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని చెప్పారు. గొప్ప ఆర్థికవేత్తగా పేరొందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సైతం ఇది సాధ్యం కాలేదని లక్ష్మణ్ అన్నారు.