సమర్థవంతంగా పథకాల అమలు
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, డిసెంబర్ 18: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు అభివృద్ది సంక్షేమ పథకాలను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయుటకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ గా భాద్యతలు స్వీకరించిన అనంతరము కలెక్టరేట్ సమావేశ మందిరం లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్య మంత్రి ఎంతో నమ్మకంగా అప్పగించిన భాద్యతలను వారి అంచనాలు చేరుకునేలా, కష్టపడి పనిచేస్తానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అర్హూలైన లబ్దిదారులకు అందేలా కృషి చేస్తానని అన్నారు. కరీంనగర్ జిల్లాతో నాకు చాలా అనుబంధం ఉందని, డిసెంబర్ – 2014 నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జిల్లా సబ్ కలెక్టర్ గా పనిచేసినట్లు తెలిపారు. 2016 – డిసెంబర్ నుండి 22 నెలల పాటు కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ గా పనిచేసినట్లు పేర్కొన్నారు. 15 నెలలకు పైగా జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ గా పనిచేసి బదిలిపై కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా నేడు విధుల్లో చేరినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ గా జిల్లా ప్రాధాన్యత అంశాలు అమలు నా ప్రాధాన్యత అని ఆయన తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందిస్తానని అన్నారు. జిల్లా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు అందరి సహకారంతో ముందుకు సాగుతానని తెలిపారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో ప్రవేశపెట్టి అమలు చేస్తున్న అన్ని పథకాల అమలులో జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానం లో నిలుపుటకు అధికారులు కృషి చేయాలని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం షెడ్యూల్ ప్రభుత్వం ప్రకటించినదని తెలిపారు. జిల్లాలో వరి ధాన్యం సేకరణ , పత్తి కొనుగోల్లు, రంజాన్ పండుగ దుస్తుల పంపిణీ , వన్ స్టాఫ్ సెంటర్ పనితీరు మొదలగు పథకాల ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్ జిల్లా రాజకీయంగా, సామాజికంగా చారిత్రాత్మకంగా సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకత కలిగిన జిల్లా అని అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను దృష్టి లో పెట్టుకుని అధికారులు వాటి అమలుకు కృషి చేయాలని అన్నారు. అధికారులందరు కలిసి సమన్వయం తో పనిచేయాలని సూచించారు. త్వరలో అన్ని శాఖల వారీగా ఆన్ గోయింగ్ స్కీమ్స్ పథకాల ప్రగతి శాఖల వారీగా సిబ్బంది వివరాలు, సమస్యలపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తానని తెలిపారు. అన్ని శాఖల అధికారులు తమ పరిధిలో అమలు జరుగుతున్న సంక్షేమ అభివృద్ది పథకాల, సమగ్ర నివేదికలు తయారు చేసి సిద్దంగా ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, జిల్లా రెవెన్యూ అధికారి ప్రావీణ్య , స్పెషల్ ఆఫీసర్ రాజర్షిషా, జిల్లా పరిషత్ సి.ఇ.వో. వెంకట మాధవ రావు , డి.ఆర్.డి.ఎ. పి.డి. వెంకటేశ్వర్ రావు, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, మార్కెటింగ్ డి.డి. పద్మావతి, జిల్లా పంచాయితీ అధికారి రఘువరన్, జిల్లా సహకార అధికారి మనోజ్ కుమార్, జిల్లా సంక్షేమాధికారి శారద, కరీంనగర్, హుజురాబాద్ ఆర్డీవోలు ఆనంద్ కుమార్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
Very nice news coverage…
Tq