ఆలా చేయాలి….
1 min read
కరీంనగర్: అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి విద్య, వైద్యం, వ్యవసాయం, మిషన్ భగీరథ, రికార్డుల శుద్దీకరణ, మైనర్ ఇరిగేషన్, పంచాయతీ రాజ్, మున్సిపల్, విద్యుత్ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు హరితహారం కార్యక్రమ నిర్వహణ పై సంబంధిత శాఖల అధికారులతో పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలన్నారు. ముఖ్యంగా రెవెన్యూ అధికారులు భూ రికార్డుల శుద్దీకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. రైతులు తమ భూములను ఆత్మ గౌరవానికి ప్రతీకగా భావిస్తారని, తహసిల్దార్ కార్యాలయానికి రైతులను తిప్పుకోకుండా అర్హులైన వారందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు అందజేయాలన్నారు. జూలై 10వ తేదీలోగా భూ ప్రక్షాళన పనులు పూర్తి చేసి గ్రామాల వారిగా బుక్ లెట్ ద్వారా తనకు అందజేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మండలాలు, గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించడానికి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు వైద్య సేవలు అందేలా చూడాలని, వైద్య సిబ్బంది ఆసుపత్రుల్లో సమయపాలన పాటించేలా చూడాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ఆసుపత్రిలో ఎంత సిబ్బంది ఉండాలి ? ఎంత ఉన్నారు? అనే వివరాలు ఇవ్వాలని వైద్యాధికారికి సూచించారు. ఈ సమావేశంలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జెసి శ్యాం ప్రసాద్ లాల్, ప్రత్యేక అధికారి ప్రావీణ్య తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.