12 తరువాత తిరిగారో…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, నవంబర్ 11: కరీంనగర్ పోలీసులు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తల్లిదండ్రుల సంరక్షణ, పర్యవేక్షణ కరువై చెడు సహవాసాలు చేస్తూ అర్ధరాత్రుల్లో తిరిగుతూ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్న యువతలో సత్ప్రవర్తన తీసుకరావడం కోసం కరీంనగర్ సీపీ వి.సత్యనారాయణ ఆదేశాల మేరకు బుధవారం అర్ధరాత్రి 12 గంటల నుండి గురువారం వేకువజాము 3 గంటల వరకు కరీంనగర్ వన్ టౌన్, టూ టౌన్ పోలీసు స్టేషన్ల పరిధిలో ఆపరేషన్ “ఛబుత్రా” పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కమీషనరేట్ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించనున్నారు. కరీంనగర్లో బుధవారం అర్ధరాత్రి నుండి గురువారం వేకువజాము 3 గంటలకు వన్ టౌన్ పరిధిలోని బస్టాండ్, వెంకటేశ్వర ఆలయం, శనివారం అంగడి, టూటౌన్ పరిధిలోని గోదాంగడ్డ, కాశ్మీర్ గడ్డ, సప్తగిరికాలనీ, డాక్టర్ స్ట్రీట్ ప్రాంతాల్లో సమయాన్ని వృధా చేస్తూ తిరుగుతున్న 57 మంది ప్రధానంగా యువత, ఇతర వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి తల్లిదండ్రులు, సంరక్షకులకు సమాచారం అందించి వారి సమక్షంలోనే కౌన్సిలింగ్ నిర్వహించారు. మరోసారి ఇలాంటి చర్యలు పునరావృతం అయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టౌన్ ఏసిపి తుల శ్రీనివాసరావు, వన్ టౌన్, టూటౌన్ ఇన్స్పెక్టర్లు సిహెచ్ నటేష్, లక్ష్మణ్ బాబు, ఎస్ లు శ్రీనివాస్ , మహేష్ తదితరులు స్వయంగా తనిఖీలను కొనసాగించారు . అక్రమ కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించేందుకు అనుమానిత ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాలను కూడా కొనసాగిస్తామని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలందించేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని, అన్ని వర్గాలకు చెందిన ప్రజలు తమవంతు సహకారం అందిస్తూ పోలీసుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని సీపీ సత్యనారాయణ ఈ సందర్బంగా కోరారు.