మహా మలుపు : పడణవీస్ రాజీనామా
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
ముంబాయి, నవంబర్ 26: మహ రాజకీయం రక్తి కట్టింది. ఎంత అనూహ్యంగా దేవేంద్ర పడణవీస్ సీఎం పదవి చేపట్టారో..అంతే అనూహ్యంగా సీఎం పదవి నుంచి వైదొలిగారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర పడణవీస్ ప్రభుత్వానికి బుధవారంలోగా బలం నిరూపించుకోవాలంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఇవాళ మహారాష్ట్ర రాజకీయాల్లో హైడ్రామా పతాక స్థాయికి చేరింది. డిప్యూటీ సీఎం పదవికి ఎన్సీపీ నేత అజిత్ పవార్ రాజీనామా చేసిన కొద్ది సేపటికే సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కూడా అదే బాటలో పయనించారు. తాను కూడా గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కలిసి రాజీనామా సమర్పించనున్నట్టు ఆయన ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పు, తదనంతర పరిణామాల నేపథ్యంలో సీఎం ఫడ్నవిస్ ఇవాళ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ-శివసేన కూటమికి అధికారం కట్టబెట్టారు. ప్రభుత్వ ఏర్పాటుకు మేము ప్రయత్నించినప్పటికీ… దురదృష్టవశాత్తూ శివసేన బేరసారాలకు దిగడం మొదలు పెట్టింది. ఎన్నికలకు ముందు శివసేనకు సీఎం పదవి ఇస్తామని ఎలాంటి హామీ ఇవ్వలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని మేము అడిగినప్పుడు వాళ్లు నిరాకరించారు. హాస్యాస్పదంగా శివసేన తమకే మెజారిటీ ఉందంటూ చెప్పుకొచ్చింది. కానీ ఒక్క పార్టీ కూడా బలం నిరూపించుకోలేదు. అందుకే రాష్ట్రపతి పాలన వచ్చింది’’ అంటూ పేర్కొన్నారు. మొత్తానికి మహ రాజకీయం రక్తి కట్టగా, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.