JMS News Today

For Complete News

ఆ జివోను ఉపసంహరించుకోవాలి…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జనవరి 2: తెలంగాణలో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల ఆందోళనకు కారణమైన 317 జీవోను తక్షణం ఉపసంహరించుకోవాలని ఓసి సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ జీవో తెలంగాణ ఉద్యమ సమయంలో లేవనెత్తిన నీళ్లు, నిధులు, నియామకాలు స్పూర్తికి విరుద్ధంగా ఉందని ఆయన ధ్వజ మెత్తారు. కరీంనగర్ ఓసి సమాఖ్య కార్యాలయంలో సమాఖ్య రాష్ట్ర, ఉమ్మడి జిల్లా నాయకులతో కలిసి నిర్వహించిన సమావేశంలో రామారావు మాట్లాడారు. 317 జీవో ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కులను ప్రభుత్వం కాల రాస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోతో ఉద్యోగులు ఉపాధ్యాయుల స్థానికతకు ముప్పు ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ వర్గాల స్థానికత నిర్ధారణ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ జీవో అమలుకు సీనియారిటీతో మెలిక పెట్టడంతో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. ఈ జీవో ద్వారా స్థానికులైన ఉద్యోగ, ఉపాధ్యాయులు స్థానికేతరులుగా మారాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా జరుగుతున్న ఈ బదిలీలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని రామారావు అభిప్రాయపడ్డారు. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల అభ్యంతరాలను, అభ్యర్థలను ప్రభుత్వం పట్టించుకోకుండా హడావుడిగా బదిలీలు చేపట్టడం సమంజసంగా లేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఏర్పడితే స్థానిక, స్థానికేతర ఉద్యమాలు తప్పవని హెచ్చరించిన వ్యాఖ్యలను ప్రస్తుత ప్రభుత్వం నిజం చేస్తున్నట్టుగా ఉందన్నారు. ఇప్పటికే సీనియారిటీ జాబితాలు, కొత్త జిల్లాలకు పోస్టింగ్ లతో తమకు తీవ్ర నష్టం జరిగిందని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆందోళనలకు దిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 317 జీవో ఆదివాసీలు, గిరిజనులకు అన్యాయం చేసేదిగా ఉందన్నారు. ఆదివాసీలకు రక్షణ కల్పించే ఐదో షెడ్యూల్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకుండా బదిలీలు చేపట్టడం ఆ వర్గాలకు నష్టం కలిగించే పరిణామం అన్నారు. భవిష్యత్తులో ఆదివాసీలకు ఉద్యోగ నియామకాల్లోను ఇది నష్టం చేకూరుస్తుందని చెప్పారు. ఉద్యోగ నియామకాల్లో వివిధ వర్గాలకు వయోపరిమితి సడలింపు ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం అయినప్పటికీ గత కొన్నేళ్లుగా నియామక ప్రక్రియ జరగకపోవడంతో వయోపరిమితి సడలింపు వయసు కూడా దాటి పోతామనే ఆందోళన నిరుద్యోగ వర్గాల నుండి వ్యక్తమవుతోందని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల ఆందోళనలు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వారికి మేలు చేసే విధంగా తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరారు.
తక్షణమే ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా వయో పరిమితి దాటి పోతున్న నిరుద్యోగులను ఆదుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో సమాఖ్య నాయకులు అనభేరి రాధా కిషన్, నల్ల రాజిరెడ్డి, జనగామ కరుణాకర్ రావు,నలుమాచు ప్రభాకర్, చాడ రవీందర్ రెడ్డి, వున్నం అంజయ్య, దేవరాజుల మనోహరశర్మ, సారబుడ్ల రాజిరెడ్డి, ఉమ్మెంతుల శ్యాంసుందర్ రెడ్డి, చందుపట్ల సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.