2,564 మందిపై కేసులు..5,204 వాహనాలు సీజ్
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఏప్రిల్ 8: కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో అమలవుతున్న లాక్ డౌస్, రాత్రి వేళల్లో కర్ఫ్యూ నిబంధనలు కఠినతరంగా అమలు చేస్తూ పోలీస్ శాఖ కమీషనరేట్ వ్యాప్తంగా పకడ్బందీ చర్యలను తీసుకుంటున్నదని పోలీసు కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు. అనవసరంగా రోడ్లపై వచ్చే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ద్విచక్ర వాహనంపై ఒకరు, కార్లు, ఇతర వాహనాల్లో ఇద్దరు మాత్రమే నిత్యావసర వస్తువుల నిమిత్తం బయటకు రావాలని, మెడికల్ షాపుల్లో మందుల కొనుగోలు , అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చేవారు అందుకు సంబంధించిన ఆధారాలను చూపాలని స్పష్టం చేశారు. లాక్ డౌన్ అమలులో భాగంగా సడలింపులు ఇచ్చిన సమయాల్లోనే నిత్యావసర వస్తువులు , మెడికల్ షాపుల్లో మందుల కొనుగోలు కోసం రావాలని సూచించారు.సామాజిక దూరం పాటించకుండా జనం గుంపులుగా ఉండే సూపర్ మార్కెట్లు, కూరగాయల మార్కెట్లు, కిరాణం దుకాణాల వద్ద యజమానులు జనాలు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని లేనట్లయితే, సదరు దుకాణాల వద్ద జమకూడిన ఉన్న ఫోటోలు , వీడియోలను తీసి వాటిని సాక్ష్యంగా స్వీకరించి కేసులను నమోదు చేయడంతోపాటు సదరు దుకాణాలను మూసివేస్తామని తెలిపారు. లాక్ డౌన్ అమలు మార్చి 22 నుండి మంగళవారం వరకు అకారణంగా రోడ్లపైకి వచ్చిన 2,564 వాహనదారులపై కేసులు నమోదు చేశామని తెలిపారు. 5,204 వివిధ రకాల వాహనాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే లాక్ డౌన్ అమలులో భాగంగా నిబంధనలు ఉల్లఘించిన 10మందితో పాటు క్వారంటైన్ / ఐసోలేషన్ నిబంధనలను అతిక్రమించిన నలుగురిపై కేసులను నమోదు చేశామని సీపీ ఆ ప్రకటన లో పేర్కొన్నారు.