JMS News Today

For Complete News

ప్లీజ్ పాటించండి…!లేదంటే…?

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, మార్చి 31: లాక్ డౌన్/కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసు కమిషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు సీపీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా మహమ్మారి రోజు రోజుకు, గంటగంటకు, నిమిష నిమిషానికి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ వేలాది మందిని కబళిస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వం ఆ మహమ్మారి బారి నుండి ప్రజలను కాపాడేందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకొని 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్, రాత్రి పూట కర్ఫ్యూ విధించడం జరిగిందని పేర్కొన్నారు. ఉదయం 6-00 గంటల నుండి సాయంత్రం 7-00 గంటల వరకు లాక్ డౌన్, కర్ఫ్యూ రాత్రి 7-00 గంటల నుండి ఉదయం 6-00 గంటల వరకు అమలులో ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు తప్పకుండా పాటించాల్సిన నియమాలను వివరించారు.

1) ప్రజలు ఇళ్లనుండీ బయటకు రాకుండా వారి వారి ఇళ్లలోనే స్వీయ నిర్బంధంలో ఉండవలెను.

2) ఇంటి ముందు గాని రోడ్లపై గాని తిరుగుతూ కనపడరాదు.

3) అత్యవసర మైన పనులు అనగా వైద్య అవసరాల కోసం మరియు నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం తప్ప ఎవరు బయటకు రాకూడదు.

4) నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం బయటకు వచ్చినప్పుడు మోటర్ సైకిల్ మీద ఒక్కరు మాత్రమే ప్రయాణించవలెను.

5) కారులో డ్రైవర్ కాకుండా మరొక వ్యక్తిని మాత్రమే అనుమతించ బడును

6) సరైన కారణం లేకుండా ఎవరైనా తమ వాహనాలపై బయట తిరుగుతూ కనబడినచో వారి వాహనాలను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేయబడును.

7) ప్రజలు తమ నిత్యవసర వస్తువుల మరియు మందుల కొనుగోలుకు వెళ్లినప్పుడు దుకాణం వద్ద ఒకరి నుండి ఒకరు దూరం పాటించవలెను. ఎందుకనగా ఈ మహమ్మారి ఒకరి నుండి ఒకరికి అంటుకుని వేగంగా వ్యాప్తి చెంది ప్రాణాలను బలి తీసుకుంటోంది.

8) యువకులు ఇంటి నుండి బయటకు వచ్చి రోడ్లపై తిరుగుతూ కనబడినట్టు అయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా చట్టపరంగా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. తమ పిల్లలు బయటకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లి తండ్రులపై వున్నది.

9) కర్ఫ్యూ సమయంలో అనగా రాత్రి 7-00 గంటల నుండి ఉదయం 6-00 గంటల వరకు అత్యవసరమైన వైద్య అవసరాలకు తప్ప ఎవరూ బయటకు రాకూడదు.

ఈ కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడడానికి ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు నిద్రాహారాలు మాని పని చేస్తున్నారని, మీరు బాధ్యతతో ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఈ మహమ్మారిని అందరూ క్రమశిక్షణతో పోరాడినప్పుడు ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చే సూచనలు సలహాలు పేపర్ ద్వారా, టీవీ ఛానల్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా గమనిస్తూ పాటించినప్పుడు మాత్రమే దీనిని మన వరకు, మన ఇంటి వరకు, మన కుటుంబం వరకు రాకుండా నివారించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రజలందరూ ఇట్టి విషయాన్ని గమనించి క్రమశిక్షణతో ఈ నియమాలు పాటించాలని పోలీసు శాఖ తరపున సీపీ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *