పోలీసుల నిర్బంధ తనిఖీలు
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 18: కరీంనగర్ శివారు ఆరెపల్లి ఆర్టీసీ కాలనీలో గురువారం పోలీసులు ఇంటింటా నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన ధ్రువ పత్రాలు లేని 35 వాహనాలు, నాలుగు క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏర్పాటైన కార్యక్రమంలో రూరల్ ఏసిపి ఉషారాణి మాట్లాడుతూ ప్రజలకు భద్రతపై భరోసా కల్పించేందుకే ఈ తనిఖీలను నిర్వహిస్తున్నామని అన్నారు. అసాంఘిక శక్తుల కదలికల నియంత్రణ, అక్రమ కార్యకలాపాలను నిరోధించేందుకు ఈ నిర్బంధ తనిఖీలు దోహదపడతాయని తెలిపారు. బాలలను పనులకు పంపకుండా పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. బాల్య వివాహాలకు సంబంధించిన సమాచారం అందించాలని కోరారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే వాహనదారులపై కేసులను నమోదు చేస్తామని తెలిపారు. వాహనాలు నడిపే వారు విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రజలు స్వచ్ఛందంగా సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా ఆ ప్రాంతం రేయింబవళ్ళు నిఘానేత్రం లో ఉంటుందని తెలిపారు. ఈ తనిఖీల్లో రూరల్ సీఐ శశిధర్ రెడ్డి, చొప్పదండి సీఐ రమేష్ తో పాటు సుమారు 200 మంది పోలీసులు పాల్గొన్నారు.