ఆ తుపాకులు ఏమయ్యాయి…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 31: తనపై ఉన్న కక్షతో
రెండు తుపాకులు తీసుకెళ్ళారని అమాయకుడైన తన గన్ మెన్ పై కేసు నమోదు చేశారని, అతన్ని సస్పెండ్ కూడా చేశారని, మరీ ఆ తుపాకులు ఏమయ్యాయని కరీంనగర్ జిల్లా పోలీసు అధికారుల సంఘం మాజీ అధ్యక్షుడు దాసరి భూమయ్య పోలీసు అధికారులను ప్రశ్నించారు. ఆ తుపాకులు ఎక్కడ ఉన్నాయో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోలీసు శాఖలో నిజాయితీగా పనిచేస్తున్న తనపై పోలీసు అధికారులే కక్ష కట్టి తనకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. అవినీతి కి పాల్పడితే ప్రజలు పట్టించాలి, కానీ పోలీసు అధికారులే ఏసీబీకీ పట్టించారని ఆరోపించారు. ఈరోజుతో నా పదవి కాలం పూర్తయిందని, ఇక నా పని పోలీస్ శాఖలో ఉన్న అవినీతిపరుల బాగోతం బయట పెట్టడమే అంటూ స్పష్టం చేశారు. ఎస్ఐ గా చేరిన సమయంలో ఎన్ని ఆస్తులు ఉన్నాయి? ఇప్పుడు ఎన్ని ఆస్తులు ఉన్నాయి ? ఆధారాలతో సహా బయట పెడతానని హెచ్చరించారు. నేను టార్గెట్ అని తెలిసి నా గన్ మెన్ లను తొలగించారని, అయినా, నాకు అవసరం లేదని, రిటైరైన పోలీసు అధికారులను మళ్ళీ సర్వీస్‌లోకి తీసుకుంటున్న నేపథ్యంలో వారు కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఈ విషయంపై సీఎం కేసీఆర్ ఆలోచించాలని కోరారు. తనపై నమోదైన కేసులకు సంబంధించి న్యాయ పరంగా ఎదుర్కొంటానని చెప్పారు. కొందరి చర్యల వల్ల అమాయకులైన పోలీసులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పోలీసు అధికారుల వాహనాల కోసం ఖర్చు చేసే డబ్బులు పేదల సంక్షేమానికి ఖర్చు చేస్తే బాగుంటుందని భూమయ్య అభిప్రాయపడ్డారు.