JMS News Today

For Complete News

వామ్మో…మెరుపుదాడులు….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఆగస్టు 20: ఎలాంటి అనుమతులు లేకుండా మానకొండూర్ మండలం ఊటూరు-వేగురువల్లి గ్రామ శివారు మానేరు వాగు నుండి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు సమాచారం అందుకున్న కమిషనరేట్‌లోని ప్రత్యేక విభాగానికి చెందిన పోలీసులతోపాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కరీంనగర్ సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు గురువారం అర్ధరాత్రి నుండి శుక్రవారం ఉదయం వరకు మెరుపు దాడులను నిర్వహించారు. పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి నిర్వహించిన ఈ దాడుల్లో ఎలాంటి అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా కరీంనగర్ – హైదరాబాద్ ప్రాంతాలకు తరలిస్తున్న 19 లారీలు చిక్కాయి. ఒక్కసారిగా పోలీసు బృందాలు మెరుపుదాడి నిర్వహించడంతో అక్రమ రవాణాదారులు లారీలను అతివేగంతో నడుపుతూ పట్టుబడకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నాలను కూడా పోలీసులు అత్యంత ధైర్యసాహసాలతో అడ్డుకున్నారు. దాడులు కొనసాగుతున్న తీరును సీపీ సత్యనారాయణ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఆదేశాలు జారీచేశారు. అత్యంత వేగంతో ఇసుకతో వెళుతున్న లారీలను చేధించి పట్టుకున్న పోలీసు బృందాలను సీపీ అభినందించడం తోపాటు రివార్డులను ప్రకటించారు. ఈ ప్రత్యేక బృందాల్లో కరీంనగర్ వన్ టౌన్ ఇన్స్ పెక్టర్ నటేష్, టూటౌన్ ఎస్ఐ మహేష్ , టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్లు సృజన్‌రెడ్డి , మల్లయ్యలతోపాటుగా వివిధ స్థాయిలకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు. అనంతరం స్వాధీనం చేసుకున్న లారీలను సంబధిత అధికారులకు అప్పగించారు. ఈ సందర్బంగా సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని స్పష్టం చేశారు. అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కేసులను నమోదు చేయడంతోపాటు వాహనాలను సీజ్ చేయడం, సదరు వాహనాల యజమానులు, డ్రైవర్లపై కేసులను నమోదు చేస్తామని వెల్లడించారు. ఇసుక అక్రమరవాణాకు పాల్పడే వారిని బైండోవర్ చేసే పక్రియ కూడా మొదలైందని పేర్కొన్నారు. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు స్పెషల్‌ బ్రాంచి, టాస్క్ ఫోర్స్ , క్యూఆర్టీ విభాగాలతో పాటు ఇతర విభాగాలకు చెందిన పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎలాంటి ఒత్తిళ్ళకు తలొగ్గకుండా ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు తీసుకుంటామని, ఇసుక అక్రమ రవాణాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న వ్యక్తులపై చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published.