పోలీసు స్టేషన్ కు జరిమానా…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూలై 4: సాదారణంగా పోలీసులు పైన్ విధించడం చూస్తుంటాం.. కానీ పోలీసులకే జరిమానా విధించడం ఆశ్ఛర్యం అనిపించినా నిజంగానే ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. గోల్కొండ కోట వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసినందుకు గాను కార్వాన్ జీహెచ్ఎంసీ అధికారులు రూ.10వేలు జరిమానా విధించారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ స్థలాలు, గోడలపై ఎలాంటి పోస్టర్లు అతికించవద్దని ఇప్పటికే జీహెచ్ఎంసీ హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే బోనాల పండుగ సందర్భంగా గోల్కొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది గొల్కొండ కోట గోడకు పోస్టర్లను అతికించారు. దీంతో అధికారులు పోలీస్ స్టేషన్‌కు జరిమానా విధించారు. దీనిపై జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ముషారఫ్ ఫారుఖీని వివరణ కోరగా.. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారెవరైనా శిక్షార్హులేనని స్పష్టం చేశారు. దీనిపై ఆసీఫ్‌నగర్ ఏసీపీ నంద్యాల నరసింహరెడ్డిని వివరణ కోరగా.. బోనాల ఉత్సవం సందర్భంగా తాము కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ఈ పోస్టర్లను పెట్టామని, అది కూడా జీహెచ్ఎంసీ పరిధిలోది కాదన్నారు. ఆర్కియాలజీకి సంబంధించిన స్థలంలో గోడకు పోస్టర్లు అతికించినట్టు తెలిపారు. అధికారుల వివరణలు వేర్వేరుగా ఉండటం గమనార్హం. మరి ఆ జరిమానా ఎవరు చెల్లిస్తారో చూడాలి.