మస్తు మస్తు…బందోబస్తు….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, అక్టోబర్ 22: ఉప ఎన్నిక నేపధ్యంలో హుజురాబాద్ నియోజకవర్గం కరీంనగర్ కమీషనరేట్, కేంద్ర, రాష్ట్రంలోని వివిధ పోలీసు బలగాల దిగ్భందంలో కొనసాగుతోంది. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పోలీసు కవాతులు నిర్వహిస్తున్నారు. ఓ వైపు టెక్నాలజీ వినియోగం, మరో వైపు ఎన్నికల విభాగాల సమన్వయంతో ఏ ఒక్క చిన్న సంఘటన చోటుచేసుకోకుండా పగడ్బందీ చర్యలతో ముందుకు సాగుతున్నారు.
* డేగకళ్ళతో కొనసాగుతున్న నిఘా..
ఎన్నికల ప్రచారం గడువు ముగింపు దశకు రానున్నడంతో పోలీసులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలకు పాల్పడే వారిపై డేగకళ్ళతో నిఘాను కొనసాగిస్తున్నారు. స్పెషల్ బ్రాంచి, టాస్క్ ఫోర్స్ , ఫ్లైయింగ్ స్క్వా డ్లు, చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు రేయింబవళ్ళు కొనసాగిస్తున్న వివిధ రకాల తనిఖీలతో అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్న వారిని కట్టడి చేస్తున్నారు. ఓటర్లను డబ్బు, మద్యం, ఇతర రకాల వస్తువులతో మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్న వారు పట్టుబడుతున్న సంఘటనలను పరిశీలిస్తే ఏస్థాయిలో పోలీసుల పగడ్భందీ చర్యలు అమలవుతున్నాయో అవగతం అవుతోంది. పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ప్రత్యక్ష పరిశీలన, ప్రతి చర్యపై సమీక్ష, అల్లర్లు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. సీపీ సత్యనారాయణ టెక్నాలజీ చర్యలు, పోలీసులు రేయింబవళ్ళు చేపడుతున్న చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించడమే కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి చర్యను సమీక్షిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తూ, ఏవైనా లోపాలు ఉన్నట్లయితే సరిదిద్దేందుకు వెంటనే ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా అల్లర్లకు పాల్పడే ఆస్కారం ఉన్న వారిని గుర్తించే సంబంధిత వ్యక్తులను సంబంధిత తహాసిల్దార్ల వద్ద బైండోవర్ చేయిస్తున్న పర్వం ప్రతినిత్యం కొనసాగుతున్న విషయం విదితమే. ప్రచారం నిమిత్తం నియోజకవర్గానికి వచ్చి వివిధ ప్రాంతాల్లో ఇళ్ళను అద్దెకు తీసుకుని ఉంటున్న , కొన్ని ప్రాంతాల్లో బస చేస్తున్న వివరాలను కూడా ఆరా తీసే పక్రియ మొదలైంది. ప్రచారం పర్వం ముగిసిన వెంటనే ఇతర ప్రాంతాల నుండి వచ్చిన స్థానికేతరులను తరలించేందుకు ప్రణాళికలను రూపొందించారు.
* ఇప్పటివరకు 120 కేసుల్లో 2.08 కోట్లు స్వాధీనం…
గతనెల 28 నుండి ఈ శుక్రవారం ఉదయం వరకు కమీషనరేట్ వ్యాప్తంగా నిర్వహించిన వివిధ రకాల తనిఖీల్లో 2.08 కోట్ల రూపాయల విలువ నగదు, మద్యం, ఇతరత్రా వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నియమావళి, కోవిడ్ నియమ నిబంధనలు పాటించని వారిపై కేసులను నమోదు చేసి అరెస్ట్ చేసే పక్రియ నిరంతరం కొనసాగుతున్నది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. 49 కేసుల్లో 1,89,11,207 రూపాయల నగదు, 58 కేసుల్లో 5,48,782 రూపాయల విలువచేసే 861.815 లీటర్ల మద్యం, 5 కేసుల్లో 44,750 రూపాయల విలువచేసే 7.81 కిలోల గంజాయి, పేలుడు పదార్థాలకు సంబంధించి 4 కేసుల్లో 40,040 రూపాయల విలువచేసే 3414 జిలిటెన్స్టిక్స్ , 2164 డిటోనేటర్లు, 1500 మీటర్ల కార్డువైరు, 2 కేనుల్లో 2,21,000 రూపాయల విలువచేసే 67 చీరలు, 40 షర్టులు , మరో 2 కేసుల్లో 10,60,00 రూపాయల విలువచేసే 30 గ్రాముల బంగారం , 14 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. 202 కేసుల్లో 903 మందిని బైండోవర్ చేశారు. ఎన్నికల నియమావళికి సంబంధించి 85 కేసులు, కోవిడ్ నియమ నిబంధనలు ఉల్లంఘించిన కేసుల్లో 589 మందిపై కేసులను నమోదు చేశారు.