అధికారులు…హాట్సాఫ్
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
జగిత్యాల, జూలై 2: ఓ పేదింటి అమ్మాయికి అధికార హోదాలో ఉన్న పెద్దలు చేయూత నందించారు. ఓ పేదింటి విద్యార్థిని చదువు కోసం మేమున్నామంటూ ముందుకు వచ్చిన జగిత్యాల జిల్లా అధికారుల తీరు ప్రశంశనీయం. వివరాల్లోకి వెళితే..జగిత్యాల జిల్లా కు చెందిన రుద్ర భూమేశ్వర్ –మమత దంపతులు అనారోగ్యం తో మృతి చెందడంతో వారి కుమారై రచన అనాధగా మారింది. పేదరికంలో కొట్టుమిట్టాడుతూనే ఉన్న రచన అక్కయ్య కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున, చేసెదెమీలేక తన తాత అమ్మమ్మ ఊర్లోనే ఉండి చదువుకుంది. ఎలాగో కష్టపడి హైదరాబాద్ స్టేట్ హోం స్కూల్లో చేరి పదవ తరగతి వరకు చదువుకుని, పాలిటెక్నిక్ లో సీటు సాధించింది. అదీ పూర్తి చేసుకుని, ఇంజనీరింగ్ చేయాలన్న పట్టుదలతో రాసిన ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంక్ పొంది ప్రతిష్టాత్మకమైన చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ (సిబిఐటి) లో సీటు సాధించుకుంది. అయితే, సీటు సాధించుకుంది కానీ, ఆర్థిక స్తోమత లేక , ఫీజు కట్టలేక, సమయం దగ్గర పడుతున్న పరిస్థితి లో సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ డా.శరత్ ను తన సోదరితో కలిసి, పరిస్థితిని విన్నవించుకుంది. చదువుకు సాయం చేయాలని వేడుకుంది. దీంతో, కలెక్టర్ శరత్ సంబంధిత అధికారితో పాటు జగిత్యాల ఆర్డీఓ నరేందర్ ను రచన పరిస్థితి ని పరిశీలించి, అవసరమైనంతగా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాస్ చెప్పిందే తడవుగా, ఆర్డీఓ నరేందర్ తనదైన శైలిలో వెంటనే రచన పరిస్థితి పరిశీలించి, ఇంజనీరింగ్ విద్యకు అయ్యే ఖర్చు, ఫీజులపై ఆరా తీశారు. ప్రతి సంవత్సరం కళాశాల ఫీజు రు.1,13,500 తో పాటు హాస్టల్ వసతికై , అయ్యే ఖర్చు కై ఎడ్యుకేషన్ లోన్ కై స్తానిక కెనరా బ్యాంక్ మేనేజర్ ని సంప్రదించారు. వెంటనే ఆర్డీఓ మాటపై రచనకు అవసరమైన ఎడ్యుకేషన్ లోన్ (ఇంజనీరింగ్ పూర్తయ్యే మూడు సంవత్సరాలకై) మంజూరు చేసి తన వంతు సహకారం అందించడానికి ముందుకు వచ్చారు. ఇందుకు అవసరమైతే ఆర్డీఓ నరేందర్ పూచీకత్తును (surity) ఇవ్వడానికి కూడా రెడీ అన్నారు. వెంటనే, జిల్లా కలెక్టర్ డా.శరత్ కు, జాయింట్ కలెక్టర్ రాజేశంకు పరిస్థితి వివరించారు. వెంటనే కలెక్టర్ శరత్ విద్యార్థిని రచనను ఓదార్చి మేమున్నాం…నువ్వు చదువుకో …అంటూ అభయమిచ్చి, ముందుగా తనవంతుగా రూ.15 వేలు డిఆర్ఓ అరుణశ్రీ ఆర్డీఓ నరేందర్ కు అందించారు. జిల్లా అధికారులూ పేదింటి విద్యార్థినికి సాయం అందించాలని సూచించారు. కలెక్టర్ శరత్ సూచనల మేరకు జిల్లా రెవెన్యూ అధికారిణి అరుణశ్రీ ఆధ్వర్యంలో లక్ష రూపాయల వరకు సేకరించి, రచన పేరిట ఆర్డీఓ ఆధ్వర్యంలో బ్యాంక్ లో డిపాజిట్ చేయించారు. ప్రతినెలా మూడు వేల రూపాయలు ‘రచన’కు అందేలా ఏర్పాట్లు చేయాలని బ్యాంకు అధికారికి సూచించారు. వెంటనే కళాశాల ఫీజు చెల్లించి, రచనను అడ్మిట్ చేయడానికి జిల్లా పంచాయతీ అధికారిణి శ్రీలతారెడ్డిని పురమాయించారు. ఇక ఆర్డీఓ గంటా నరేందర్ రచన బాధ్యతలను తీసుకుని, ఎడ్యుకేషన్ లోన్ కై ఏర్పాట్లు చేశారు. ఎడ్యుకేషన్ లోన్ కు పూచీకత్తుగా ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ…మానవతా దృక్పథంతో ఓ పేదింటి, తల్లి తండ్రులు లేని అనాధ విద్యార్థిని ఆదుకోవడం జిల్లా కలెక్టర్ గా తన బాధ్యతలు నిర్వర్తించాననీ, తనతో పాటు ఆర్డీఓ నరేందర్ విద్యార్థిని రచన బాధ్యతను తీసుకోవడం అభినందనీయమన్నారు. మొత్తానికి పేద విద్యార్థినికి అధికారులు అండగా నిలవడం నిజంగా అభినందనీయం.