రాష్ట్రపతి ఏమన్నారంటే….
1 min read
న్యూఢిల్లీ: పార్లమెంట్ సెంట్రల్ హాల్లో గురువారం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలిపారు. సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఓం బిర్లాను అభినందించారు. ‘అందరితో కలిసి.. అందరికీ వికాసం.. అందరి విశ్వాసం (సబ్కా సాథ్.. సబ్ కా వికాస్.. సబ్కా విశ్వాస్)’ అనే నినాదం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్రపతి అన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని రైతులందరికీ విస్తరించినట్లు తెలిపారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్‌ను ప్రవేశపెట్టిందని, అది వారి ఆదాయాన్ని పెంచుతుందన్నారు. ఇది ప్రభుత్వం సాధించిన గొప్ప అంశమన్నారు. రైతులకు పెన్షన్ కూడా ఇస్తోందన్నారు. నేషనల్ డిఫెన్స్ ఫండ్ నుంచి సైనికుల పిల్లలకు స్కాలర్షిప్ అందుతోందన్నారు. 2022లో భారత్ 75వ స్వాతంత్ర వేడుకలు నిర్వహించనున్నదని, ఇది గర్వకారణమైన విషయం అన్నారు. భవిష్యత్తు తరాల కోసం నీటిని నిలువ చేసుకోవాల్సిన అవసరం ఉందని, దీని కోసం జల శక్తి మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశారన్నారు. కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని బలోపేతం చేసేందుకు గత వారం కేంద్ర సర్కార్ ముఖ్యమంత్రులను కలిసిందన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా సుమారు 12 వేల కోట్ల రూపాయాలను రైతులకు గత మూడు నెలల్లో పంపిణీ చేశారన్నారు. మత్స్యశాఖలోనూ బ్లూ రెవల్యూషన్ ప్రారంభించినట్లు చెప్పారు. మత్స్య సంపద పెంపుదల కోసం భారీ మొత్తం నిధులు కేటాయించినట్లు తెలిపారు.