రామడుగు ఎస్ఐ చొరవ…సీపీ అభినందనలు
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
రామడుగు, మార్చి 30: తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ విద్యార్థిని ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు రామడుగు పోలీసులు. రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన విద్యార్థిని దివ్య (19) సోమవారం తెల్లవారు జాము నుండి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. అయితే, లాక్ డౌన్ నేపథ్యంలో ఆస్పత్రికి వెళ్లేందుకు వాహనం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చివరకు రామడుగు ఎస్సై గొల్లపల్లి అనూష కు సమాచారం అందించారు. సత్వరం స్పందించిన ఎస్ఐ వెంటనే వెదిర గ్రామానికి చేరుకొని కడుపునొప్పితో బాధపడుతున్న సదరు విద్యార్థిని కరీంనగర్ లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి పోలీస్ పెట్రోకార్ వాహనంలో తరలించారు. ఈసందర్భంగా ఎస్ఐ అనూష మాట్లాడుతూ పోలీసులు కేవలం శాంతిభద్రతల పరిరక్షణ కోసమే పని చేస్తారనే భావనను విడనాడి ప్రజాహిత కార్యక్రమాల్లో తాము సైతం భాగస్వాములం అవుతామని అన్నారు. ప్రజలు తమకు ఎలాంటి ఆపద వచ్చినా పోలీసులకు సమాచారం అందించినట్లుయితే సత్వరం స్పందించి సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఎస్ఐ అనూష చూపిన చొరవ పట్ల ఆ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కడుపునొప్పితో బాధపడుతున్న విద్యార్థిని దివ్యను ఆసుపత్రికి తరలించడంలో ఎస్సై అనూష తో పాటుగా కానిస్టేబుల్ లింగారెడ్డి, పెట్రోల్ కార్ డ్రైవర్ లు భగవాన్, హేమంత్ లను కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి అభినందిస్తూ వారికి రివార్డులను ప్రకటించారు.