JMS News Today

For Complete News

అక్కడ..ఎందుకిలా..!?

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్‌, ఫిబ్రవరి 17: ఆ కాలువ వద్ద ఏమవుతోంది? అక్కడే వరస ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? ప్రమాద జోన్ గా  మారడానికి గల కారణాలేమి ? సరైన భద్రత చర్యలు లేకనా? లేక వాహనదారుల ఏమరు పాటా, తప్పిదమా? ఇలా అనేక సందేహలు, అనుమానాలు. కారణాలేమైనా ప్రజల ప్రాణాలు మాత్రం గాలిలో కలిసిపోతున్నాయి. సుమారు పక్షం రోజుల కిందట కారు కాలువలో పడి దంపతులు మృతి చెందగా, ఆదివారం రాత్రి ఓ బైక్ అదుపుతప్పి కాల్వలో పడిపోవడంతో గాలింపు చర్యలు చేపట్టిన క్రమంలో మరో విషాదం వెలుగు చూసింది. పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి సోదరి కుటుంబం కాల్వలో కారులోనే శవాలుగా కనిపించారు. ఏదిఏమైనా కరీంనగర్‌ శివారు అల్గునూరు సమీపంలోని కాకతీయ కాల్వలో వరుస ప్రమాదాలు మాత్రం కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం రాత్రి గన్నేరువరం గ్రామానికి చెందిన దంపతులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి కాల్వలో పడిపోయిన ఘటనలో భార్య కీర్తన మృతి చెందగా, భర్త ప్రదీప్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే, కీర్తన మృతదేహం కోసం కాల్వలో నీటి ప్రవాహాన్ని తగ్గించి గాలింపు చర్యలు చేపట్టిన క్రమంలో మరో విషాదం వెలుగులోకి వచ్చింది. కాకతీయ కాలువకు సుమారు కిలో మీటర్ దూరంలో బోల్తా పడి ఉన్న ఓ కారు కనిపించింది. ఈ సమాచారం అందుకున్న ఎల్ఎండి ఎస్సై నరేశ్ రెడ్డి తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని కారును బయటికి తీసి మూడు మృత దేహాలను వెలికితీశారు. కారు నంబర్‌ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి సోదరి కుటుంబంగా నిర్థారణకు వచ్చారు. ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసుల ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. కారులో బ్యాగ్, మెడలో ఆభరణాలు, ఒక సెల్‌ఫోన్‌ లభించాయి. ఘటనా స్థలాన్ని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్ కమలాసన్‌రెడ్డి, కలెక్టర్ కె శశాంక, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, దాసరి మనోహర్ రెడ్డి తదితరులు సందర్శించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చిన్న సోదరి రాధ కుటుంబం ప్రస్తుతం కరీంనగర్‌లో నివాసముంటోంది. ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా.. భర్త సత్యనారాయణ రెడ్డి ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. కుమార్తె వినయశ్రీ నిజామాబాద్‌లోని ఓ దంత వైద్య కళాశాలలో బీడీఎస్‌ చదువుతోంది. ఆరేళ్ళ క్రితం వీరి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుమారుడి మృతితో రాధ కొంత మానసికంగా బాధ పడుతుండగా, ప్రతి ఆరు మాసాల కొకమారు ఏదో ఒక టూర్ పెట్టుకుని వెళ్తూ, వస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే గత నెల 27న ఇంటినుంచి బయల్దేరారు. ఆ తరువాత ఏమి జరిగిందో ? ఏలా జరిగిందో ? తెలియదు కానీ ముగ్గురికి ముగ్గురు కాలువలో కారులోనే శవాలుగా మారారు. 28వ తేది నుంచి వీరి సెల్ ఫోన్లు పని చేయలేదు. టూర్లో ఉన్నారన్న బావనలో బంధువులు ఉన్నారు. ఆకస్మికంగా సోమవారం ఈ వార్త వెలుగులోకి రావడంతో విషాదం నెలకొంది. మృతదేహాలు పూర్తి గా కుళ్లిపోవడంతో అక్కడే శవ పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, తన సోదరి కుటుంబం మృతిపై ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబంలో ఎలాంటి కలహాలూ లేవని స్పష్టం చేశారు. గత నెల 27న సాయంత్రం ఊరికు వెళ్లాలనే ఆలోచనతో ఉన్నారనీ, ఈ క్రమంలో అనుకోని సంఘటన జరిగిందని ఆయన ఆవేదన చేశారు. ఏడాదికోసారి ఏదైనా టూర్‌కు వెళ్తుంటారనీ, అలా ఏమైనా వెళ్లారేమో అనుకొని ఎదురుచూశామని తెలిపారు. కానీ ఇలా కారులో శవాలుగా బయటపడటం బాధాకరమన్నారు. కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు లేవనీ.. ఎంతో సంతోషంగా ఉండేవారని చెప్పారు. ఏదిఏమైనా కాకతీయ కాలువ వద్ద జరుగుతున్న వరస ప్రమాదాలు మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ప్రమాదం నేేేపథ్యంలో మంత్రి గంగుల వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *