ఆ మంత్రి చొరవ హాట్సాఫ్…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 13: మంత్రి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి సాయం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఆ మంత్రి వారికి బాసటగా నిలిచారు. గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం అందించాలని కూడా వైద్యులను ఆదేశించారు. ఆ మంత్రి ఎవరో కాదు సాక్షాత్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి రాజేందర్ శనివారం జగిత్యాల వెళ్తున్న సందర్భంగా, గంగాధర- జగిత్యాల రోడ్డుపై బైకు- కారు ఢీ కొన్న ప్రమాదంలో గాయపడిన ముగ్గురు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వారిని చూసిన మంత్రి వెంటనే స్పందించి, వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని జగిత్యాల సీఐ వాహనంలో గాయపడిన వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈటల రాజేందర్ తో పాటు మరో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు కూడా ఉన్నారు. మంత్రి చూపిన చొరవ పై పలువురు హర్షం వ్యక్తం చేశారు