రాజీవ్ రహదారి రక్తసిక్తం…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఫిబ్రవరి 27: రాజీవ్ రహదారి రక్తసిక్తమైంది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం గురువారం వేకువజామున రామకృష్ణాకాలనీ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన కాసారపు వివేక్ చంద్ర, వేముల ప్రణయ్ కుమార్, అంకం స్వరాజ్ , బియ్యాల శివకేశవులు అనే నలుగురు స్నేహితులు కలిసి బుధవారం రాత్రి హైదరాబాద్ లో ఫంక్షన్ ఉందని ఇంట్లో చెప్పి బయలుదేరి, మద్యలో ఒకచోట మందు సేవించి కారులో హైదరాబాద్ వెళ్తున్నారు. ఈ క్రమంలో రాజీవ్ రహదారి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణా కాలనీ స్టేజీ సమీపాన ముందు ఉన్న లారీని ఓవర్ టేక్ చేయబోయి కారు లారీ వెనక వైపు బలంగా ఢీకొన్నది. ఈ ప్రమాదంలో వివేక్ చంద్ర (20), ప్రణయ్ కుమార్ (28) అక్కడికక్కడే మృతి చెందారు. స్వరాజ్, శివ కేశవులకు తీవ్ర గాయాలు కాగా, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కారు నుజునుజ్జయింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహలను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రణయ్ కుమార్ , శివకేశవ్ లు సింగరేణి ఉద్యోగాలు చేస్తుండగా, వివేక చంద్ర బీటెక్ , స్వరాజ్ ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. సంఘటన స్థలాన్ని కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి పరిశీలించారు . ప్రమాదానికి కారణం మద్యం మత్తు అని తేల్చారు. కారు నడిపిన స్వరాజ్ కు శ్వాస పరీక్షలు నిర్వహించగా, ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ నమోదైనట్లు తెలిపారు. అలాగే కారులో ఉన్న వారు సీట్ బెల్టు దరించి ఉంటే బతికేవారని అన్నారు. సీపీ వెంట ట్రైనీ ఐపీఎస్ నితికా పంత్, ఏసీపీ విజయసారధి, సీఐ మహేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.