JMS News Today

For Complete News

అటు ప్రయాస…ఇటు జేబులు ఖాళీ

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, అక్టోబర్ 5: డ్యూటీకి రాకుంటే ఉద్యోగాలు ఊడినట్లే..అంటూ ఓ వైపు సర్కార్ హెచ్చరికలను జారీ చేయడం, మరోవైపు ఆ హెచ్చరికలను ఖాతరు చేయకుండా  ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టడం, వెరసీ తెెెెలంగాణ ప్రజలకు దసరా గోస మొదలైంది. తెలంగాణ ప్రజలకు అతి పెద్ద పండుగ బతుకమ్మ, దసరా పండగ సందర్భంగా ప్రజలను ఊర్లళ్ళకు చెరవేసే ప్రగతి రథ చక్రాలు ఈసారి రోడ్డెక్కకపోవడంతో ప్రయాణ ఇబ్బందులు మొదలయ్యాయి. ఎన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన ప్రజలకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. ప్రైవేట్ వాహనాల బాదుడుకు జనాల జేబులకు చిల్లులు పడ్డాయి. నాలుగేళ్ల తరువాత ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. శుక్రవారం అర్ధ రాత్రి నుంచి సమ్మెలోకి కార్మికులు వెళ్ళగా, శనివారం ఉదయం నుంచి ఒక్క బస్ కూడా రోడ్డెక్కలేదు. కార్మిక సంఘాలతో త్రిసభ్య కమిటీ జరిపిన చర్చలు విఫలమైన నేపథ్యంలో సమ్మెకు దిగిన కార్మికులు, నిన్నటి నుంచే దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల విధుల నుంచి వైదొలగారు. ఇక గత అర్ధరాత్రి నుంచి ఎక్కడికక్కడే బస్సులు నిలిచిపోయాయి. త్రిసభ్య కమిటీని రద్దు చేేేసిన ప్రభుత్వం తీవ్రమైన హెచ్చరిక ప్రకటన చేేేసిన తరువాత, అత్యవసరంగా సమావేశమైన ఆర్టీసీ జేఏసీ, ఉద్యోగులెవరూ భయపడాల్సిన అవసరం లేదని, విధుల్లోకి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకునేందుకు శాంతియుత నిరసనలు తెలియజేయాలని సూచించారు. కాగా, ఇప్పటికే ఆర్టీసీలో ఉన్న 2100 అద్దె బస్సులతో పాటు 6,900 పాఠశాలలు, కాంట్రాక్ట్ బస్సులను సిద్ధం చేసింది. అలాగే తాత్కాలిక పర్మిట్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బస్సులు నడిపేందుకు ముందుకొచ్చే వారిని కార్మిక సంఘాలు అడ్డుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా అన్ని డిపోల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తోంది. డిపోల వద్ద అడ్డుకుంటున్న  ఆర్టీసీ నాయకులు, కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేేసి స్టేషన్ లకు తరలించారు. హుస్నాబాద్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పలుచోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కాగా, ప్రతీ డిపో వద్ద ఓ అధికారిని నియమించామని, ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. ఇదిలా ఉంటే మెదక్ జిల్లా పెద్దశంకరంపేట్ మండలం కొలపలి వద్ద ఆకోల రహదారిపై నారాయణఖేడ్ డిపో చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. తాత్కాలిక డ్రైవర్ నడుపుతుండగా, ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలు కాగా, ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనను చూపిస్తూ ఆర్టీసీ యూనియన్ నాయకులు ప్రజలు ఆలోచించాలని కోరారు. మొత్తానికి బస్సులు డిపోలకే పరిమితం కాగా, ప్రయాణీకులకు  తిప్పలు తప్పడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *