బ్లాక్ మెయిల్ సహించం…కేసీఆర్ సంచలన నిర్ణయం
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, అక్టోబర్ 6: ఆర్టీసీ చరిత్రలో ఒక నూతనాధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఇందులో భాగంగా ఆర్టీసీని లాభాల్లోకి తీసుకుపోవాలనీ, సంస్థ మనుగడ కొనసాగాలంటే కొన్ని చర్యలు తప్పవనీ సీఎం పేర్కొంటూ ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు చేస్తున్న సమ్మెపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. విధులకు హాజరుకాని ఉద్యోగులపై వేటు వేయాలని నిర్ణయించారు. ఆర్టీసీని విలీనం చేసే ప్రసక్తే లేదని, ఇకపై ఆర్టీసీ- ప్రైవేట్ భాగస్వామ్యంతో బస్సులు నడుస్తాయని, ఆర్టీసీ నడిపే బస్సుల్లో సగం ప్రైవేట్ బస్సులు ఉంటాయని స్పష్టం చేశారు. ఆర్టీసీ జేఏసీతో చర్చలు కూడా ఉండవని, బ్లాక్ మెయిల్ చేస్తే ప్రభుత్వం తలవంచదని తేల్చి చెప్పారు. ఆర్టీసీలో మిగిలింది కేవలం 1200 మంది ఉద్యోగులేనని, కొన్ని రోజుల్లోనే కొత్త సిబ్బందిని నియమిస్తామని ప్రకటించారు. కొత్తగా చేరే ఉద్యోగులు యూనియన్ లో చేరబోమని సంతకం చేయాలని అన్నారు. అటు ప్రతిపక్షాలు ఆర్టీసీ విషయంలో మాట్లాడే హక్కు లేదని పేర్కొన్నారు. సీపీఎం అధికారంలో ఉన్న నాడు పశ్చిమ బెంగాల్ లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసారా? కేరళలో చేసారా? బీజేపీ ఎన్నో రాష్ట్రాలలో అధికారంలో వుంది కాని ఎక్కడైనా విలీనం చేసారా? కాంగ్రెస్స్ పార్టీ ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలోనైనా చేశాయా? అందుకే వాళ్లకు అడిగే హక్కు లేదని, అఖిల పక్ష సమావేశం డిమాండ్ అసంబద్ధమని, తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అందరి కళ్ళూ తెరిపించాలి”. అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం ప్రగతి భవన్ లో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపి మహేందర్ రెడ్డి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగ్ రావు, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, రవాణా శాఖ కమీషనర్ సందీప్ సుల్తానియా, అడిషనల్ డీజీపీ జితేంద్ర, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ విషయాలన్నీ కూలంకషంగా చర్చించి, ఒక నివేదిక సమర్పించడానికి రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ అధ్యక్షతన ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.