JMS News Today

For Complete News

ఆర్టీసీ ఆసక్తికరం..! విచారణ వాయిదా

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, నవంబర్ 7: ఆర్టీసీ సమ్మెపై సందిగ్ధం కొనసాగుతూనే ఉండగా, ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విధుల్లో చేరేందుకు సీఎం కేసీఆర్ గడువు ఇచ్చిన కార్మికులు ఖాతరు చేయకపోగా, ప్రభుత్వం తమను చర్చలకు పిలవాల్సిందేనంటూ భీష్మించుకు కూర్చున్నారు. ఇదిలా ఉంటే ఇవాళ హైకోర్టు విచారణ జరపగా, ఆసక్తికర వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె 34వ రోజుకు చేరగా, సమ్మెపై తాజాగా, హైకోర్టులో విచారణ జరిగింది. ప్రధానంగా ఆర్టీసీ అధికారులు సమర్పించిన అఫిడవిట్లపై విచారణ జరగ్గా, కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు వాదనలు వినిపించారు. ఆర్టీసీని విభజించాలని కానీ, పునర్వ్యవస్థీకరించాలని కానీ తమ అనుమతి కోరలేదని విన్నవించారు. అసలు, ఏపీఎస్ఆర్టీసీ విభజన ఇంకా పూర్తి కాలేదని వెల్లడించారు. అలాంటప్పుడు చట్టబద్ధతలేని టీఎస్ఆర్టీసీలో 33 శాతం వాటా ఎక్కడ ఉంటుందని, చట్టబద్ధత ఉన్న ఏపీఎస్ఆర్టీసీలోనే 33 శాతం వాటా ఉందని రాజేశ్వరరావు కోర్టుకు తెలియజేశారు. టీఎస్ఆర్టీసీకి చట్టబద్ధత లేనందున ఏపీఎస్ఆర్టీసీలో కేంద్రానికి ఉన్న వాటాను బదిలీ చేయడం కుదరదని తేల్చి చెప్పారు. దీనిపై ఏజీ, తెలంగాణ ఆర్టీసీ అధికారులు స్పందిస్తూ, ఆర్టీసీ విభజన అంశం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉందని కోర్టుకు తెలిపారు. విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేశామని చెప్పారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, ఏపీఎస్ఆర్టీసీని విభజించాలని రెండు రాష్ట్రాలు కోరాలి కదా? అని ప్రశ్నించింది. కేంద్రం ఆమోదం లేకుండా కొత్త ఆర్టీసీ సంస్థలు ఏర్పాటు ఎలా సాధ్యం అంటూ అడిగింది. విభజన అంశం పెండింగ్లో ఉందని మీరే చెబుతున్నారు ? అలాంటప్పుడు కొత్త ఆర్టీసీ ఏర్పాటు ఎలా సాధ్యమైందని న్యాయమూర్తి ప్రశ్నించారు. అదేకాకుండా అధికారులు సమర్పించిన నివేదికలపై కూడా కోర్టు అసహనం వ్యక్తం చేసింది. అనంతరం తదుపరి విచారణను 11వ తేదికి వాయిదా వేసింది. ఈ పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో ఈ అంశం తేలేలా లేనట్టుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *