5నుంచి సమ్మె చేస్తాం…
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, అక్టోబర్ 2: ఆర్టీసీ కార్మికులు సమ్మె వైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయి. ప్రభుత్వం నియమించిన సోమేష్ కుమార్ కమిటీ జరిపిన చర్చలు సఫలం కాలేదు. ఈ నెల 5వ తేదీ నుంచి సమ్మె చేపట్టబోతున్నామంటూ టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మీడియాకు వెల్లడించారు. సోమేశ్ కుమార్ కమిటీతో జరిగిన చర్చల్లో ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదని ఆయన చెప్పారు. సమస్య పరిష్కారం దిశగానే తాము కూడా ఆలోచిస్తున్నామని, అయితే తమ డిమాండ్లను నెరవేర్చేలా ప్రభుత్వం కూడా కృషిచేయాలని అన్నారు. గతంలో కూడా ప్రభుత్వం కమిటీలను వేసిందని అవి నివేదికలు ఇవ్వలేదని చెప్పారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతోపాటు తమ 26 డిమాండ్లను పరిష్కరించేంతవరకు పోరాడతామని తెలిపారు. తమ డిమాండ్లలో 2, 3 అంశాలు తప్ప మిగిలిన అంశాలన్నీ పరిష్కరించేవేనని చెప్పారు. ఆర్టీసీ కార్మికులంతా పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.