వారి ప్రదర్శన అద్భుతం…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
తిమ్మాపూర్, ఆగస్టు 22: విద్యార్థుల్లో పరిజ్ఞానాన్ని వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడతాయని బీసీ గురుకుల పాఠశాలల జిల్లా ఆర్సీఓ తిరుపతి రెడ్డి అన్నారు. తెలంగాణ బీసీ గురుకుల విద్యా సంస్థ సొసైటీ పరిధిలోని14 బీసీ బాలికల గురుకుల పాఠశాలలకు సంబంధించిన జిల్లా స్థాయి సైన్సు ఫేర్ ఎల్ఎండి కాలనీలోని బీసీ బాలికల గురుకుల పాఠశాలలో గురువారం ప్రారంభమైంది. రెండ్రోజుల పాటు జరగబోయే ఈ కార్యక్రమాన్ని ఆర్సీఓ తిరుపతిరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పాఠశాలకు వచ్చిన తిరుపతిరెడ్డికి స్కౌట్ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. సైంటిఫిక్ సొల్యూషన్స్ ఫర్ ఛాలెంజ్ ఇన్ లైఫ్ అనే అంశంపై వైజ్ఞానిక ప్రదర్శన చేపట్టారు. రవాణా సమాచారం, ఆర్గానిక్ వ్యవసాయం, ఆరోగ్యం పరిశుభ్రత, రిసోర్సు మేనేజ్ మెంట్, వ్యర్థాల నిర్వహణ, గణిత మోడలింగ్ తదితర అంశాలపై 264 మంది విద్యార్థులు,132 ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు సీతారామయ్య, రాఘవరెడ్డి, వేణుగోపాల్, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినులు తయారు చేసిన మోడళ్లు అందర్నీ ఆకర్షించాయని ఆర్సీఓ తిరుపతిరెడ్డి తెలిపారు. రెండు రోజుల పాటు ప్రదర్శన ఉంటుందని, సమీపంలోని పాఠశాలల విద్యార్థులు తిలకించవచ్చని చెప్పారు. 12 మంది న్యాయనిర్ణేతలు రెండ్రోజుల పాటు ప్రదర్శనలను పరిశీలించి, ఉత్తమ నమూనాలను ఎంపిక చేస్తారని అన్నారు. ప్రథమ, ద్వితీయ బహుమతులు పొందిన వారిని రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు పంపిస్తామని తిరుపతి రెడ్డి చెప్పారు.