నిరాడంబరంగా రాములోరి పెళ్ళి…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఏప్రిల్ 2: కరోనా మహమ్మారి లేకుంటే రాములోరి కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగేవి. ఊరూరా ఉండే రామాలయాలు భక్తులతో కిటకిటలాడేవి. మధ్యాహ్నం అన్న ప్రసాదాల వితరణతో సందడిగా మారేవి. కానీ ఈ కరోనా మహమ్మారి కారణంగా ఎటువంటి ఆర్భాటాలు, సందడి లేకుండానే నిరాడంబరంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీరామ నవమి ఉత్సవాలు జరిగాయి. ప్రముఖ ఆలయాల్లో కేవలం అర్చకులు, సిబ్బంది మాత్రమే పాల్గొన్నారు. మిగితా చిన్న చిన్న ఆలయాల్లో అర్చకులు, ఆలయ కమిటీ ముఖ్యులు, గ్రామ సర్పంచ్, ఎంపిటిసిలు కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఫలితంగా భక్తుల సందడి లేకుండా ఆలయాలు బోసిపోయి కనిపించాయి. అందులో సామాజిక దూరం పాటిస్తూ, కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామంలోని రామాలయంలో రాములోరి కళ్యాణ మహోత్సవ వేడుకలు నిరాడంబరంగా కొనసాగాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోల రమేష్, ఎంపిటిసి వంచ మహేందర్ రెడ్డి, ఆలయ చైర్మన్ జానంపేట మారుతీ స్వామి, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.