మళ్ళీ ఎన్నికల సందడి….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జనవరి 30: హమ్మయ్య మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి ? ఇక ఊపిరి పీల్చుకోవచ్చని అనుకుంటున్న సమయంలోనే తెలంగాణ సర్కార్ మరో ఎన్నికల సందడికి తెరలేపింది. మళ్ళీ ఏం ఎన్నికలు అనుకుంటున్నారా అవే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు. ఈ మేరకు రాష్ట్ర సహకార సంఘం ఎన్నికల నోటిఫికేషన్ అంతా సిద్ధం చేసింది. ఫిబ్రవరి 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. 6 నుంచి 8వ తేదీ వరకు మూడురోజులపాటు నామినేషన్లను స్వీకరించనున్నారు. 9వ తేదీన నామినేషన్ల పరిశీలన. 10వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. అదేరోజు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించనున్నారు. 15వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహణ. అదేరోజు మధ్యాహ్నం కౌంటింగ్ చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 127 ప్రాథమిక సహకార సంఘాలు ఉండేవి. జిల్లాల విభజన అనంతరం మండలాలకు రెండు చొప్పున పెరిగే అవకాశాలున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో మళ్ళీ ఎన్నికల సందడి మొదలవ్వబోతుంది. అయితే, సహకార సంఘాల ఎన్నికలే కదా ఇక్కడ ఏం పోటీ ఉండదు అనుకుంటే పొరపాటే. ఇక్కడ కూడా చాలామంది పోటీ పడే అవకాశం ఉంటుంది. సహకార సంఘాల ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న ఆశావహుల్లో ఆశలు మొదలయ్యాయి.