ఆ అర్చకులను ఆదుకోవాలి…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఏప్రిల్ 2: చిన్న చిన్న దేవాలయాలలో పూజారులుగా పనిచేస్తున్న అర్చకులకు (చాత్తాద శ్రీ వైష్ణవ) నిత్యావసర వస్తువులు అందించి ఆదుకోవాలని చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జగన్నాధం శ్రీనివాస స్వామి, ధర్మపురి శేఖర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం వారు విడుదల చేసిన ఒక ప్రకటనలో చిన్న చిన్న ఆలయాల్లో పూజారులుగా పనిచేస్తున్న అర్చకులకు నెలసరి జీత భత్యాలు లేక, రోజువారీగా వచ్చే భక్తుల కానుకలతోనే వారి కుటుంబాలను పోషించుకుంటున్నారని, అయితే, కరోనా ప్రభావంతో దేవాలయాలకు భక్తుల రాక తగ్గిపోవడంతో అర్చకులు వారి కుటుంబాన్ని పోషించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పైగా చాలామందికి రేషన్ కార్డులు కూడా లేవని, ఫలితంగా ప్రభుత్వం అందిస్తున్న 12కిలోల బియ్యం, రూ.1500 నగదు అందుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచించి చిన్న చిన్న ఆలయాల పూజారులకు నిత్యావసర వస్తువులు, రూ.1500 నగదు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.