రెండేళ్ల తర్వాత…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఏప్రిల్ 10: అందంగా ముస్తాబైన కల్యాణ మండపాలు, వేద మంత్రాలు, మంగళహారతులు, శ్రీరామన్నామస్మరణలు, భక్తీ గీతాలు, మంగళవాయిద్యాలు,
భక్తుల జయజయధ్వానాల నడుమ అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలు కన్నుల పండువగా.. అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆదివారం జగత్కళ్యాణ కారకులైన సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలు వీధివీధినా వైభవోపేతంగా నిర్వహించారు. అభిజిత్ లగ్న ముహుర్తాన జీలకర్ర, బెల్లంతో సహా తలంబ్రాలను కళ్యాణ మూర్తులచే పోయించి, మంగళసూత్ర బంధనాలను సమంత్రకంగా అర్చకులు వైభవోపేతంగా నిర్వహించారు. వీఐపీలచే కల్యాణ మూర్తులకు పట్టువ స్త్రాల సమర్పణలు, వేద పండితులచే కళ్యాణం నిర్వహణలు, సాయంత్రం పలుచోట్ల రథోత్సవాలు జరిగాయి. కల్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమాలు, పులిహోర ప్రసాద పంపిణీ కార్యక్రమాలను నిర్వాహకులు చేపట్టారు. అయితే, రెండేళ్లుగా ఆలయాల్లో ఏకాంతంగా, నిరాడంబరంగా జరిగిన రాములోరి పెళ్ళి వేడుకలను తిలకించలేని భక్తులు ఈసారి మాత్రం అధిక సంఖ్యలో తరలివచ్చి రాములోరి పెళ్ళిని తిలకించారు. ముఖ్యంగా రామాలయాలలో రామయ్య కల్యాణాలు నేత్రపర్వంగా జరగగా, రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
మొత్తంమీద రాష్ట్ర వ్యాప్తంగా కన్నుల పండువగా జరిగిన రాములోరి కల్యాణ మహోత్సవ వేడుకలను భక్తులు కనులారా తిలకించి పులకించిపోగా, శ్రీరామన్మమ స్మరణలతో ఆలయ ప్రాంగణాలు మారుమ్రోగాయి.