మాకు సహకరించండి…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
న్యూ ఢిల్లీ, ఆగస్టు 8: కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రాజేందర్ తెలంగాణ పథకాలకు సహకరించాలని కోరారు. అనంతరం రాజేందర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వైద్య రంగంలో తీసుకున్న కొత్త సంస్కరణలకు కేంద్ర సహకారం, సాయం కావాలని కోరామని, అందుకు కేంద్ర మంత్రి సంపూర్ణ సహకారం ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కాకతీయ మెడికల్ కాలేజ్ లో సూపర్ స్పెషల్ హాస్పిటల్, ఆదిలాబాద్ లో మరో సూపర్ స్పెషల్ హాస్పిటల్ బ్లాక్ నిర్మాణం పనులు జరుగుతున్నాయని, వీటికి సహాయం చేయాలని కోరినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 9 మెడికల్ కాలేజీలు ఉన్నాయని, ఖమ్మం, కరీంనగర్ రెండు జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వాలని కోరగా, సానుకూలంగా స్పందించారని తెలిపారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలో జిల్లా ఆస్పత్రులను అప్ గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలో 40 డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయని, వాటిని పెంచేందుకు సహాయం కోరామని, ఐసియు సెంటర్ల్ ను కేటాయించాలని కోరామని తెలిపారు. కొన్ని జాతీయ రహదారులపై ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. వీటి తో పాటు పలు అంశాలను దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, తెలంగాణ లో చేపడుతున్న పథకాలకు సహకరించాలని కోరినట్లు మంత్రి రాజేందర్ తెలిపారు. ఆయన వెంట ఎంపీలు బండ ప్రకాష్ ముదిరాజ్, బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు ఉన్నారు.