ఊచల్లోకీ ఉత్తమ అధికారిణీ…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూలై 11: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన ఉత్తమ అధికారిణి ఊచలు లెక్క పెడుతోంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ లావణ్యను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి, కోర్టులో హాజరు పర్చగా, ఆమెను రిమాండ్ కు పంపింది. భారీ మొత్తంలో నగదు లభించడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ అవినీతి కేసును అధికారులు మరింత లోతుగా శోధిస్తున్నారు. ఎవరెవరికి ఈ అక్రమాల్లో సంబంధాలు ఉన్నాయో ? ఎవరెవరు భూముల వ్యవహారాల్లో తలదూర్చారు ? రికార్డుల మార్పుకు సహకరించిన సిబ్బంది, తదితరుల సంబంధాలు ? ఆమె గత కార్యకలాపాలపైనా వివరాలు సేకరిస్తున్నారు. బుధవారం రాత్రి వరకు లావణ్య నివాసంలో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు గురువారం ఉదయం ఆమెను అరెస్టు చేశారు. ఆమె భర్త వెంకటేశ్ నాయక్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన మున్సిపల్ పరిపాలనా విభాగంలో పనిచేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. కొందుర్గు వీఆర్వో అనంతయ్య నిన్న ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడగా, లావణ్య వ్యవహారం బయటపడింది. లావణ్య ఆదేశాల మేరకే అనంతయ్య లంచం తీసుకుంటున్నట్టు ఏసీబీ విచారణలో తేలింది. హయత్‌నగర్‌లోని ఆమె నివాసంలో సోదాలు జరపగా, రూ.93లక్షల నగదు, 40తులాలకు పైగా బంగారం లభ్యమైంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు తేలడంతో లావణ్యను అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయంలో విచారణ పూర్తయిన తర్వాత లావణ్యను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమెను ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నివాసానికి ఆమెతో పాటు అనంతయ్యను తీసుకెళ్లి హాజరు పరిచారు.