ముందస్తు చర్యల్లో నిర్లక్ష్యం…
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 27: వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలుతుంటాయని తెలిసి కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో ప్రజలు విషజ్వరాలు, అంటువ్యాధుల బారిన పడుతున్నారని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు అనేక ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయని పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం కూడా వ్యాధులు ప్రబలడానికి కారణమని ఆయన పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికలు జరిగి నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు ప్రభుత్వం వారికి చెక్ పవర్ కల్పించకపోవడం వల్ల సర్పంచులు సానిటేషన్,పారిశుద్ధ్య పనులకు నిధులు కేటాయించలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగానే గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు, మురుగు కాలువల్లో పూడికతీత,క్లోరినేషన్ వంటి పనులు జరగడం లేదన్నారు. దీంతో గ్రామాల్లో డెంగ్యూ ,మలేరియా జ్వరాలు ప్రబలుతున్నాయని, వాంతులు, విరేచనాలతో ప్రజలు బాధపడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన చికిత్స అందకపోవడం వల్ల రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారని,డాక్టర్లు పారా మెడికల్ సిబ్బంది గ్రామాల్లో అందుబాటులో ఉండడం లేదని, అత్యవసర మందులను అందుబాటులో ఉంచడం లేదని ఆరోపించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని. గ్రామాల్లో వైద్యులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉండేలా చూడాలని, వ్యాధుల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని జోజిరెడ్డి కోరారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి పురాతన భవనం శిథిలావస్థకు చేరుకుందని, శ్లాబ్ కప్పు పెచ్చులూడి పోతున్నాయని, పెచ్చు లూడటంతో కరెంటు వైరింగ్ తీగలు బయటకు తేలడంతో షార్ట్ సర్క్యూట్ ఎప్పుడు జరుగుతుందోనని రోగులు భయపడుతున్నారని జోజిరెడ్డి పేర్కొన్నారు. పత్రికలు, టీవీల్లో వీటి గురించిన కధనాలు వచ్చినా జిల్లా వైద్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని, జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా స్పందించకపోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాల నుండి కాక ఇతర జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో రోగులు ఇక్కడికి వస్తుంటారని, 500 పడకల ఆస్పత్రి స్థాయిని పెంచి సూపర్ స్పెషాలిటీ వైద్యశాలగా మార్చిన ప్రభుత్వం ఆ దిశగా వైద్య సేవలు అందించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. సౌకర్యాలు లేకనే రోగులను వరంగల్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చికిత్స కోసం వెళ్లాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జిల్లా ప్రధాన ఆస్పత్రిలో వైద్యులను అందుబాటులో ఉంచడమే కాకుండా మందులతో పాటు ఇతర వసతులు కల్పనకు సత్వర చర్యలు తీసుకోవాలని జోజిరెడ్డి కోరారు.