పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యం
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 23: తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచిన కరీంనగర్ జిల్లాలో పూర్వవైభవం తెచ్చేందుకు గ్రామస్థాయి నుండి పార్టీ పటిష్టతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి జోజి రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో 36వ డివిజన్ కు చెందిన ఇర్ఫాన్ ఆధ్వర్యంలో 60 మంది యువకులకు ఆయన కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జోజిరెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త పార్టీ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావలసిన అవసరం ఉందన్నారు. పార్టీ నిర్మాణంలో భాగంగా పార్టీ కార్యకర్తల్లో నూతనోత్తేజం కలిగించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని, గ్రామ, మండల, డివిజన్, వార్డు కమిటీలు వేసుకోవాలని, ప్రజాసమస్యలపై ఆందోళనలు చేపట్టి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధిని మర్చిన కేసీఆర్ ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత విషయాలపై దృష్టి సారించిందని జోజిరెడ్డి ఆరోపించారు. తెలంగాణ సకల జనుల కదలికలపై టిఆర్ఎస్ ప్రభుత్వ నిఘా పెట్టేందుకు ప్రయత్నాలు చేపడుతుందని ఇది అత్యంత ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీని విధించే ప్రయత్నంలో భాగంగా వ్యక్తుల కదలికలపై నిఘా ప్రయత్నాలు ముమ్మరం చేసిందని ఆయన విమర్శించారు. ప్రజల హక్కులు, స్వేచ్ఛను హరించే అధికారం కేసీఆర్ కు ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. 360 డిగ్రీస్ తీసుకురావడమే నిజమైతే వ్యక్తిగత విషయాలే కాకుండా భార్యా భర్తల బెడ్ రూమ్ సీక్రెట్స్ కూడా రికార్డు అవుతాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజా స్వేచ్ఛకు సంకెళ్లు వేయకుండా డిజిటల్ ఫుట్ ప్రింట్ సందేశాల సేకరణ విరమించుకోవాలని, ఈ విషయంలో కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకుని తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ కుట్రలను భగ్నం చేయాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, ఇళ్ల కేటాయింపులో అవకతవకలకు నిరసనగా ఈనెల 26న టీడీపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లాలని జోజిరెడ్డి కోరారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు కళ్యాణపు ఆగయ్య, ఎడ్ల వెంకటయ్య, షకీలా, నాగుల బాలా గౌడ్, సందెబోయిన రాజేశం, శ్రీనివాస్ రెడ్డి, దాసరి రామకృష్ణారెడ్డి, మహమ్మద్ ఖాన్, అవుదుర్తి విజయ్ కుమార్, బీరెడ్డి కరుణాకర్ రెడ్డి, ఎస్కే అహ్మద్, నిజాముద్దీన్ జుబేర్, నరేందర్ దత్తు తదితరులు పాల్గొన్నారు.