మహిళలకు రక్షణ కల్పించడంతో విఫలం
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, నవంబర్ 29: మహిళల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు నూజెట్టి వాణి ఆరోపించారు. శనివారం తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండించారు. డాక్టర్ ప్రియాంక రెడ్డి, మానస హత్య ఉదంతాల నుంచి తేరుకోకముందే సిద్దులగుట్ట సమీపంలో మరో ఘటన చోటుచేసుకోవడం రాష్ట్ర ప్రజానీకాన్ని కలవరపాటుకు గురి చేసిందన్నారు. హైదరాబాద్ నగర శివారులో వరుసగా ఈ తరహా ఘటనలు చోటుచేసుకోవడంపై వాణి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో మహిళల మాన, ప్రాణాలకు రక్షణ లేదనడానికి ఈ ఉదంతాలే నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు రోజురోజుకి పెచ్చు మీరడం ఆందోళన కలిగిస్తోందన్నారు. వరుస హత్యలతో మహిళల్లో భయాందోళన, అభద్రత భావం నెెలకొందని, రాష్ట్రంలో ఇన్ని పాశవిక హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం కానీ పోలీసులు గాని పటిష్టమైన చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా ఉండేందుకు నిర్భయ చట్టం తెచ్చినా నేరాలు తగ్గడం లేదని, మహిళలను ఇంకా అలానే చూస్తూ అకృత్యాలకు పాల్పడుతూనే ఉన్నారన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నేరస్తులకు వణుకు పుట్టేలా బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రియాంక రెడ్డి, మానస హత్యలతో పాటు సిద్దులగుట్ట ఘటనకు బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలని, ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులను అవహేళన పరిచేలా మాట్లాడిన పోలీసులపై కూడా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో మహిళా నాయకులు దూస స్వాతి, బొట్ల భారతమ్మ, జవాజి పుష్ప తదితరులు పాల్గొన్నారు.