JMS News Today

For Complete News

సీఎం లు ఏమన్నారంటే…

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్‌, జూన్ 28:  అందుబాటులో ఉన్న నీటి వనరులను సంపూర్ణంగా, సమర్థవంతంగా వినియోగించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ మూలకు సాగునీరు, మంచినీరు అందించే విషయంలో కలిసి ముందుకు సాగుతామని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి లు స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు పచ్చగా కలకలలాడాలని, వ్యవసాయానికి, తాగునీటికి, పరిశ్రమలకు నీటి కొరత రాకుండా చూడాలనే లక్ష్యంతో ఉన్నట్లు వివరించారు. శుక్రవారం ఇరు రాష్ట్రాల సీఎంల తొలి అధికారిక సమావేశం  ప్రగతి భవన్ లో  జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నదీ జలాల వినియోగానికి సంబంధించి గతంలో ఉన్న వివాదాలను గతం గతః అన్న రితీలో మరిచిపోయి, మంచి మనసుతో రెండు రాష్ట్రాలకు ఎంత వీలయితే అంత మేలు చేసే విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ వేర్వేరు అనే భావన తమకు లేదని, రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలన్నదే తమ అభిమతమని వెల్లడించారు. ఉభయ రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఉభయ ప్రభుత్వాలు పనిచేస్తాయని ప్రతిన బూనారు. కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతం, తెలంగాణలోని పాలమూరు, ఉమ్మడి నల్గొండ జిల్లాలు ఎదుర్కుంటున్న దశాబ్దాల సాగునీటి కష్టాలను దూరం చేసేందుకు గోదావరి నీటిని శ్రీశైలం తరలించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. గోదావరి నీటిని శ్రీశైలం రిజర్వాయర్ కు తరలించే వ్యూహం ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, బి.రాజేంద్ర నాథ్, కురసాల కన్నబాబు, పేర్ని వెంకట్రామయ్య(నాని), ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి. సుబ్రమణ్యం, సిఎం ముఖ్య కార్యదర్శి అజయ్ కల్లం, నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, సీనియర్ అధికారులు ఎల్.ప్రేమ చంద్రారెడ్డి, కె.ధనుంజయ రెడ్డి, నీటి పారుదల శాఖ ఇఎన్సి ఎం.వెంకటేశ్వర్ రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ తరుఫున ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రులు ఈటెల రాజెందర్, ఎస్.నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సీనియర్ ఎంపి కె.కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, జెన్ కో -ట్రాన్స్ కో సిఎండి డి.ప్రభాకర్ రావు, సలహాదారుడు టంకశాల అశోక్, ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, నీటి పారుదల శాఖ ఇఎన్సీ మురళీధర్, రిటైర్డ్ ఇంజనీర్లు శ్యాంప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందు గా ప్రగతి భవన్ చేరుకున్న జగన్ బృందానికి ముఖ్యమంత్రి, ఇతర తెలంగాణ మంత్రులు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సమావేశం సందర్భంగా నదుల్లో నీటి లభ్యతపై ముఖ్యమంత్రి కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలు గోదావరి, కృష్ణా వాటి ఉపనదులపై లెక్కలేనన్ని బ్యారేజిలు నిర్మించడం వల్ల కిందికి నీటి రాని పరిస్థితిని వివరించారు. సి.డబ్ల్యు.సి. లెక్కల ప్రకారం ఏ పాయింట్ వద్ద ఎంత నీటి లభ్యత ఉందో వివరించారు. గూగుల్ మ్యాపుల సహకారంతో గోదావరి, కృష్ణా నదుల నీళ్లను సమర్థ వంతంగా వినియోగించుకోవడానికున్న మార్గాలను ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్ బృందంతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో మద్యాహ్న భోజనం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *