మరికొన్ని గంటల్లో….!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, సెప్టెంబర్ 9: మరికొన్ని గంటల్లో తెలంగాణ శాసనసభ, శాసనమండలిలలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2019-20 ని శాసనసభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టనుండగా, మండలిలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రవేశ పెట్టబోతున్నారు. సోమవారం ఉదయం11:30గంటలకు అసెంబ్లీలో కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం చేయనుండగా, హరీష్ రావు మండలిలో ప్రసంగించనున్నారు. ఈ బడ్జెట్ కు సంబంధించి ఆదివారం రాత్రి నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదించింది. ఈసారి రూ.1.65 లక్షల కోట్లతో ఈ బడ్జెట్ ను రూపొందించినట్లు సమాచారం. గత లోక్ సభ ఎన్నికల ముందు ఫిబ్రవరిలో రూ.1.82 లక్షల కోట్లతో ఒట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ కేవలం ఆరు మాసాలకే వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో ఇపుడు పూర్తి స్థాయి జనరల్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టబోతున్నారు. ఏ శాఖలకు ఎంతెంత బడ్జెట్ కేటాయించారనేది కొన్ని గంటల్లో తేలిపోనుంది. కాగా, సమావేశాలను సీరియస్ గా తీసుకోవాలని మంత్రులకు సీఎం కేసీఆర్ సూచించారు. శాఖలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని నిర్దేశించారు. సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు వెనువెంటనే సమాధానం చెప్పేలా చూసుకోవాలని మంత్రులకు సీఎం కేసీఆర్ సూచించారు. ఆటు ప్రతిపక్షాలు కూడా పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సన్నద్ధంగా ఉన్నాయి. మొత్తానికి మరికొన్ని గంటల్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, ఇటు ప్రభుత్వ, అటు ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలు, సమాధానాలతో సమావేశం వేడెక్కబోనుంది.