JMS News Today

For Complete News

వారి సమక్షంలో..గ్రామ సభల్లో ఎంపిక…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఆగస్టు 14: దళిత బంధు పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబానికి మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ కులాల ప్రిన్సిపాల్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ తో కలిసి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలో పైలేట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో దళిత బంధు పథకాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించుటకు ఈ పైలేట్ ప్రాజెక్టులో తలెత్తిన సమస్యలను గుర్తించి మార్గదర్శకాలు రూపొందించేందకు ఉపయోగపడుతుందని తెలిపారు. దళిత బంధు అద్భుతమైన పథకమని అన్నారు. ఈ పథకం క్రింద అర్హత కలిగిన ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేస్తామని తెలిపారు. దీనికి బ్యాంకు లింకేజీ లేదని అన్నారు. దళిత బంధు పథకాన్ని ఈ నెల 16 న రాష్ట్ర ముఖ్యమంత్రి హుజురాబాద్ నియోజకవర్గంలో లాంచనంగా ప్రారంభిస్తారని తెలిపారు. ప్రారంభ కార్యక్రమంలో నిరుపేద దళిత కుటుంబాలకు చెందిన 15 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆర్థిక సహాయం చెక్కులను అందజేస్తామని అన్నారు. ఈ పథకం అమలుకు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సీనియర్ ప్రత్యేక అధికారులు, గ్రామ సర్పంచు, ఎంపిటిసిలు, ప్రజాప్రతినిధులు, దళితుల సమక్షంలో గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారని తెలిపారు. లబ్ధిదారుల జాబితాను గ్రామ పంచాయితీ కార్యాలయం బోర్డులలో ప్రదర్శిస్తారని అన్నారు. ఈ పథకాన్ని ముందుగా అతి నిరుపేద కుటుబాలకు, తర్వాత దళిత కుటుంబాలందరికి మంజూరు చేస్తామని తెలిపారు. షెడ్యూల్డ్ కులాల ప్రిన్సిపాల్ సెక్రటరీ రాహుల్ బొజ్జ మాట్లాడుతూ దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలో పైలేట్ ప్రాజెక్టుగా చేపట్టి అర్హత గల ప్రతి దళిత కుటుంబానికి మంజూరు చేస్తామని తెలిపారు. ఒక గ్రామంలో అందరూ ఒకే స్కీమ్ కాకుండా వారి ఆసక్తి, అభిరుచి, వృత్తి నైపుణ్యతను బట్టి వేర్వేరు స్కీమ్ లు ఎంపిక చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న స్కీములను అధికారులు ఒకటి నుంచి రెండు సంవత్సరాలపాటు విజయవంతంగా స్కీమ్ నడుపుకునేలా పర్యవేక్షిస్తారని తెలిపారు. దళిత బంధు లబ్ధిదారులు దురదృష్టవశాత్తు చనిపోతే ఆదుకొనుటకు వీలుగా దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ రక్షణ నిధికి లబ్ధిదారుల వాటా, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుందని తెలిపారు. అంతకుముందు అధికారులతో దళిత బంధు పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *