హమ్మయ్యా..అందరూ పాసే…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూన్ 8: ఇటు విద్యార్థులు, అటు తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేసిన టెన్త్ పరీక్షల నిర్వహణపై ఎట్టకేలకు చిక్కుముడి వీడింది. ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసేందుకు కేసీఆర్ సర్కార్ మొగ్గు చూపింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యం కాదు కనుక, ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో, రాష్ట్రంలో ప్రబలివున్న సందర్భంలో పదవ తరగతి పరీక్షలపై ముఖ్యంమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సిఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 5,34,903 మంది పదవ తరగతి విద్యార్థులున్నారు. మొత్తం ఆరు సబ్జెక్టులు, 11 పేపర్లుండగా, అందులో రెండు సబ్జెక్టులకు సంబంధించిన 3 పేపర్ల పరీక్షలు పూర్తయ్యాయి. ఆ సమయంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. వాయిదా వేసిన పరీక్షలకు సంబంధించి తదుపరి నిర్ణయం తీసుకోవడానికి సోమవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని సిఎం నిర్వహించారు. ఈ సమావేశంలో పదవ తరగతి పరీక్షల విషయంలో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు అనుసరించిన పద్ధతులను పరిశీలించారు. తెలంగాణలో ఏమి చేయాలనే విషయంలో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం తెలంగాణలో అనుసరించాల్సిన పద్దతిని ఖరారు చేశారు. గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వచ్చే గ్రేడులను పరగణలోకి తీసుకుని పదవ తరగతి విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. డిగ్రీ, పిజి తదితర పరీక్షల నిర్వహణకు సంబంధించి భవిష్యత్ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తానికి పది పరీక్షలపై నెలకొన్న ఆందోళన, ఉత్కంఠకు కేసీఆర్ సర్కార్ ముగింపు నిచ్చింది.