బాహుబలి ఓపెన్… ఇక నో కరువు…
1 min read
అదో మహా అద్భుత జల కావ్యం..మానవ ఇంజనీరింగ్ మేథకు ఓ మచ్చుతునక…మూడేళ్ళ కాలంలోనే పూర్తి చేసుకున్న ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశ ఎత్తిపోతల ప్రాజెక్టు…అదే కాళేశ్వరం ప్రాజెక్టు. బాహుబలిగా అభివర్ణిస్తున్న ఆ ప్రాజెక్టు ఎంత అద్భుతమో… ఆ ప్రాజెక్టు ప్రారంభం కూడా అంతా అద్భుతంగా కొనసాగింది. త్రివేణి సంగమాన అతిరథుల మధ్య అట్టహాసం గా ప్రాజెక్టు జాతికి అంకితమైనది. గవర్నర్ నరసింహన్, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వై.ఎస్.జగన్, దేవేంద్ర ఫడ్నవీస్ ల సమక్షంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సరిగ్గా శుక్రవారం ఉదయం 11:26 నిమిషాలకు తెలంగాణ జాతికి అంకితం చేశారు. అంతకుముందు మేడిగడ్డ వద్ద జల సంకల్ప యాగం నిర్వహించారు. ఈ యాగంలో సీఎం దంపతులు పూజలు నిర్వహించగా, గవర్నర్ నరసింహన్, సీఎంలు జగన్, ఫడ్నవీస్ లు పాల్గొన్నారు. తరువాత మేడిగడ్డ ఆనకట్ట శిలాపలకాన్ని ఏపీ సీఎం జగన్ ఆవిష్కరించగా, కేసీఆర్, ఫడ్నవీస్, నరసింహన్ లు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. అనంతరం ఇక్కడి నుంచి హెలికాఫ్టర్ లో కన్నెపలికి చేరుకొని పుంపుహౌస్ ను ప్రారంభించి నీటిని వదిలారు. ఇది ఇలా ఉండగా, కనురెప్ప వాల్చని నిఘా. ఒకప్పుడు మావోలకు కంచుకోటగా ఉన్నా…తూర్పు ప్రాంతంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఉండడం, ఆ ప్రాజెక్టుకు ఒక గవర్నర్, ముగ్గురు సీఎంలు, పలువురు మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్న దరిమిలా పోలీసు యంత్రాంగం నాలుగంచెల భద్రత చర్యలు చేపట్టారు. సుమారు ఐదు వేల మంది పోలీసులతో పాటు డ్రోన్ కెమరాలు, బైనాక్యులర్ ద్వారా భద్రత చర్యలు కొనసాగాయి. కాగా, ప్రాజెక్టు జాతికి అంకితం ఇవ్వగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ టిఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.