చెట్టెక్కితే ఏం జరిగిందో తెలుసా…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
చిగురుమామిడి, జూన్ 28: చెట్టు ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన ఓ రైతుకు ఐదేళ్లుగా పరిష్కారం కానీ సమస్య ఐదు నిమిషాల్లో పరిష్కారమైనది. ఈ ఘటన చిగురుమామిడి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. తన తండ్రి గత 30 ఏండ్ల క్రితం కొన్న వ్యవసాయ భూమికి నేటికి పట్టా పాస్ బుక్ జారీ చేయడం లో రెవెన్యూ అధికారులు అలసత్వం వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ చిగురుమామిడి కి చెందిన మల్లం అనంత రాములు అనే రైతు శుక్రవారం ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గతంలోను పట్టా పాస్ బుక్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ అప్పట్లో ప్రొసీడింగ్ కే ఇచ్చిన పాస్ బుక్ రాలేదని రైతు బంధు డబ్బులు నష్ట పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారుల తీరుపై విసిగి వేసారి స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో వేపచెట్టుకు ఉరి వేసుకొనే ప్రయత్నంలో అక్కడే ఉన్న రైతులు, అధికారులు రైతుకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ రైతు ససేమిరా అనడంతో తహశీల్దార్ శ్యామ్ సుందర్ రంగంలోకి దిగి సమస్యను ఇప్పుడే పరిష్కరిస్తామని ఖచ్చితమైన హామీ ఇవ్వడంతో రైతు అనంత రాములు చెట్టు దిగి వచ్చాడు. తహశీల్దార్ శ్యామ్ సుందర్ రైతుకు సంబంధించిన ఫైల్ ను పరిశీలించారు. ఆర్ వో ఆర్ చేయడానికి సంబంధిత పట్టేదార్లను పిలిపించి విచారించారు. వాస్తవాలు పరిశీలించి తెలుసుకున్నాక రైతు అనంత రాములుకు తహశీల్దార్ శ్యామ్ సుంధర్ ప్రొసీడింగ్ అందజేశారు. తహశీల్దార్ స్పందించిన తీరుపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. తహశీల్దార్ మాట్లాడుతూ రైతులు సామరస్యంగా సంయమనం తో ఉంటే ఏండ్ల తరబడి పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను పరిష్కారం చేస్తున్నామని చెప్పారు. రైతులు ఆత్మ స్థైర్యం కోల్పోవద్దని మనోధైర్యం తో ఉండాలని కోరారు. బీజేపీ దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మంద శ్రీనివాస్, సీపీఐ నాయకుడు బోయిని పటేల్ తదితరులు ఉన్నారు.