ఏపీలో రేషన్ డీలర్లకు మంగళం… !
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
అమరావతి, జూన్ 25: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. అవినీతికి తావులేని విధంగా పథకాలు, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాలని ఆయన కోరుకుంటున్నారు. అమరావతి వేదికగా సాగుతోన్న కలెక్టర్ల సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవినీతిరహిత పారదర్శక పాలనే తమ ప్రభుత్వ ధ్యేయమని మరోసారి స్పష్టం చేసిన సీఎం, ఆ దిశగా వెళ్లేందుకు అధికార యంత్రాంగం పూర్తిగా సహకరించాలని పేర్కొన్నారు. ఇక, ప్రభుత్వ అందజేసే రేషన్‌ను నేరుగా లబ్దిదారులకు గ్రామ వలంటీర్లే అందజేయనున్నారని సీఎం ప్రకటించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇకపై రేషన్ డీలర్లు ఉండబోరని జగన్ వెల్లడించారు. వాలంటీర్లే సరకులను ఇంటింటికీ పంపిణీ చేస్తారనే అంశంపై చర్చ సందర్భంగా రేషన్ డీలర్ల ప్రస్తావన వచ్చిన సమయంలో సీఎం పైవిధంగా స్పందించినట్లు తెలుస్తోంది. తెల్ల రేషన్ కార్డుదారులకు సెప్టెంబరు 1 నుంచి సన్న బియ్యాన్నే పంపిణీ చేయాలని అధికారులకు నిర్దేశించారు. ఇందుకు పౌర సరఫరాల శాఖ రూపొందించిన ప్రతిపాదనలు, కలెక్టర్ల నుంచి తీసుకునే సహకారం తదితర అంశాలపై ఆ శాఖ కమిషనర్ కోన శశిధర్ నివేదించారు. ప్యాకింగ్ యూనిట్ల ఏర్పాటు, గొడౌన్లు సంబంధిత వివరాలను పౌరసరఫరాల సంస్థ ఎండీ సూర్యకుమారి వివరించారు. తినగలిగే బియ్యాన్ని, అదీ ప్యాకింగ్ రూపంలో ఇచ్చే ప్రక్రియ రెండు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. ప్యాకింగ్ యూనిట్లు, నిల్వ కేంద్రాల ఏర్పాటు కొలిక్కి వచ్చిన జిల్లాల్లో తొలి విడతలో, మిగితా చోట్ల రెండో విడతలో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. వీటితోపాటు మరిన్ని అంశాలపై చర్చించారు.