దసరా వేళ..విషాదం నింపిన పిడుగులు
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
ఖమ్మం, అక్టోబర్ 9: పిడుగు రూపంలో వచ్చిన మృత్యువు దసరా పండుగ వేళ మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. పిడుగుపడిన దుర్ఘటనలో ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లా ముదిగొండ ఎస్సీ కాలనీకి చెందిన శ్రీను (20), ప్రవీణ్ (19), నవీన్ (19), గోపిలు అనే నలుగురు స్నేహితులు మంగళవారం సాయంత్రం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమయ్యింది. దీంతో స్నేహితులంతా ఓ చెట్టు కిందకు చేరుకున్నారు. అయితే, వీరు ఉన్న చెట్టు మీదే పిడుగు పడడంతో ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందగా, గోపి తీవ్రంగా గాయపడి ఆపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. గోపిని ఖమ్మం ఆసుపత్రికి తరలించగా, అతని పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలిసింది. పండుగ పూట జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా, మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు లో ఉంది.