ఉరి కొయ్యకు ఆ నలుగురు…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
తీహర్, మార్చి 20: ఎట్టకేలకు వారి కథ ముగిసింది. చివరి వరకు క్షమాభిక్ష కోసం ప్రయత్నం చేసి న్యాయం ముందు ఓడిపోయి ఉరి కొయ్యకు వేలాడారు. నిర్భయ దోషులకు గురువారం తెల్లవారుజామున 5:30 గంటలకు తీహార్ జైలు అధికారులు మరణ దండన అమలు చేశారు. అంతకుముందు వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. దోషుల ఆరోగ్య పరిస్థితి బాగున్నట్టు నిర్ధారించారు. ఉరితీత నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టిన అధికారులు జైలును లాక్డౌన్ చేశారు. మరోవైపు, జైలు బయట జనం పెద్ద సంఖ్యలో గుమిగూడారు. మీరట్ నుంచి వచ్చిన తలారి పవన్ జల్లాడ్ నిర్భయ దోషులైన ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మలను ఉరితీశాడు. దక్షిణాసియా దేశంలోనే అతి పెద్దదైన తీహార్ జైలులో ఒకే నేరానికి సంబంధించి నలుగురిని ఉరితీయడం ఇదే తొలిసారి. ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు చివరి క్షణం వరకు దోషులు చేసిన ప్రయత్నాలేవీ ఫలితంచలేదు. చట్టపరంగా వారికి ఉన్న అన్ని హక్కులు ఉపయోగించుకున్నారు. అయినప్పటికీ ఊరట లభించలేదు. దీంతో ఘటన జరిగిన ఏడేళ్ల తర్వాత వారికి ఉరిశిక్ష అమలైంది. నిర్భయ దోషులకు మరణ దండన అమలు కావడంపై నిర్భయ తల్లిదండ్రులతోపాటు దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.