JMS News Today

For Complete News

విలీనం చేస్తేనే ఆ సంస్థకు మనుగడ

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఆగస్టు 28:  తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని టీఎస్ ఆర్టీసీ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌరవ అధ్యక్షుడు అంబడి జోజి రెడ్డి డిమాండ్ చేశారు. టీజేఎంయూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా నియామకమైన సందర్భంగా బుధవారం ప్రతిమ మల్టీప్లెక్స్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అనుసరిస్తున్న లోపభూయిష్ట విధానాల కారణంగానే ఆర్టీసీ సంస్థ పీకల్లోతు అప్పుల్లో కూరుకు పోయిందని, నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిన అవసరం ఉందని జోజిరెడ్డి అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, ఎన్నికల ప్రచార సభల్లోనూ ప్రకటనలు చేసిన కేసీఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ విలీనాన్ని విస్మరిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమికను పోషించిన ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులను విస్మరించడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 2007 నుండి జరగాల్సిన వేతన సవరణను ఇప్పటివరకు ప్రభుత్వం ప్రకటించకపోవడంతో ఆర్టీసీ కార్మికులు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నష్టాలను సాకుగా చూపిస్తూ కేసీఆర్ ప్రభుత్వం కార్మికుల పే స్కేలు అమలు చేయకపోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ఈ ఐదేళ్ల కాలంలో ఆరు వేల మంది వరకు ఉద్యోగులు పదవీ విరమణ చేయగా, వారి స్థానంలో ఇప్పటివరకు కొత్త నియామకాలు చేపట్టకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆయన విమర్శించారు. ఆర్టీసీ కార్మికులకు బాసటగా నిలవాల్సిన గుర్తింపు కార్మిక సంఘం టిఎంయూ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. సమస్యల సాధనలో విఫలమైన టీఎంయూ, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే అందరం కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. టీజేఎంయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.హన్మంత్ ముదిరాజు మాట్లాడుతూ ఆర్టీసీ యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, సర్కారు కుట్రలను ఎండగడుతూ కార్మిక వర్గాన్ని జాగృతపర్చేందుకు గత నెల 7వ తేదీ నుంచి కార్మిక చైతన్య యాత్ర చేపట్టినట్టు చెప్పారు. మెదక్ జిల్లా జహీరాబాద్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర 33వ రోజున కరీంనగర్ చేరుకుందన్నారు. కార్మికులు ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు రాజీలేని పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు టి సుధాకర్ మాట్లాడుతూ ఆర్టీసీని కాపాడుకోవడంతో పాటు సంస్థ ఉద్యోగులు కార్మికులకు న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కావడమే టీజీ ఎంయూ లక్ష్యమన్నారు. ఇది ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రేమనాథ్, కార్యదర్శులు జీవీకే రెడ్డి , నరేందర్, సంయుక్త కార్యదర్శులు శ్యాముల్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్,నాయకులు రమేష్, సత్యనారాయణ, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *